శివరాత్రి కానుకగా ఏకంగా 7 సినిమాలు థియేటర్లో విడుదల

259
7 Telugu Movies Releasing on Shivaratri 2021
7 Telugu Movies Releasing on Shivaratri 2021

సంక్రాంతి తర్వాత మళ్ళీ బాక్సాఫీస్ బరిలో ఆసక్తికరమైన పోరుకు శివరాత్రి పండగ వేదిక కాబోతోంది. మార్చి 11న శివరాత్రి కానుకగా ఏకంగా 7 సినిమాలు విడుదల కాబోతున్నాయి. గడిచిన రెండు నెలల్లో కొన్ని వారాల్లో తొమ్మిది, పది సినిమాలు విడుదలైనా… ఒకటి రెండు మినహా అందులో మిగిలినవన్నీ చిన్న సినిమాలే ఉండేవి. కానీ రాబోయే శివరాత్రి రోజున మూడు మీడియం బడ్జెట్ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. వీటిని ప్రముఖ వ్యక్తులు నిర్మిస్తుండంతో అందరి దృష్టీ ఆ సినిమాలపై పడింది.

 

శివరాత్రి కానుకగా 11వ తేదీ గురువారం వస్తున్న సినిమాల్లో ప్రధానమైనవి శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’, శ్రీవిష్ణు నటించిన ‘గాలి సంపత్’, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ‘జాతిరత్నాలు’. ఇందులో ‘శ్రీకారం’ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఈ బ్యానర్ లో ‘గద్దలకొండ గణేశ్’ తర్వాత వస్తున్న మూవీ ఇదే.

 

ప్రస్తుతం రైతుల జీవితాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పల్లెటూరి నేపథ్యంలో రైతు జీవన విధానంపై వస్తున్న ‘శ్రీకారం’పై పాజిటివ్ బజ్ నెలకొంది. ఇక రెండో సినిమా ‘గాలి సంపత్’లో మాటలు రాని వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తే… ఆయన్ని ఆటపట్టించే కొడుకుగా శ్రీవిష్ణు నటించాడు. దీనికి అనిల్ రావిపూడి రచన చేయడం మాత్రమే కాదు.. సమర్పకుడిగానూ వ్యహరించాడు. గతంలో అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’లో హీరో రవితేజాను గుడ్డివాడిగా చూపించి కూడా సూపర్ హిట్ ను అందుకున్నాడు. దాంతో ఇందులో రాజేంద్ర ప్రసాద్ పాత్ర సైతం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుందని అంతా నమ్ముతున్నారు.

 

ఇక ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తెలకు సంబంధించిన స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రముఖ దర్శకుడు నాగ అశ్విన్ నిర్మించిన సినిమా ‘జాతి రత్నాలు’. నవీన్ పోలిశెట్టి నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చక్కని విజయాన్ని అందుకోవడంతో ఈ మూవీ మీద కూడా సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. చిత్రం ఏమంటే అనిల్ రావిపూడి, నాగ అశ్విన్ లకు నిర్మాతలుగా ఇవి మొదటి సినిమాలు.

 

ఈ మూడు సినిమాలతో పాటే 11వ తేదీ ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’, కన్నడ అనువాద చిత్రం ‘రాబర్ట్’ విడుదల కాబోతున్నాయి. ఇక 12వ తేదీ శుక్రవారం ‘లవ్ లైఫ్‌ అండ్ పకోడి’, ‘పైసా పరమాత్మ’ సినిమాలు రిలీజ్ అవున్నాయి. మరి ఈ ఏడు సినిమాలలో ఏ యే చిత్రాలు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటాయో చూడాలి.