Ram Charan RC16 Shooting Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘RC16’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్రబృందం, ఇందులో చరణ్ – దివ్యేందులపై క్రికెట్ నేపథ్య సన్నివేశాలను తెరకెక్కించింది. ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ కానుందన్న టాక్ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.
మార్చిలో ఢిల్లీలో భారీ షెడ్యూల్!
తాజాగా అందిన సమాచారం ప్రకారం, మార్చి తొలి వారం నుంచి ఢిల్లీలో నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కుస్తీ నేపథ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కథ ప్రకారం, ఈ సినిమాలో క్రికెట్, కుస్తీతో పాటు మరికొన్ని స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఉండబోతోందని సమాచారం.
చరణ్ కొత్త క్యారెక్టర్ – టైటిల్ టీజర్ అప్డేట్!
ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan Look RC16) ఓ సరికొత్త క్యారెక్టరైజేషన్లో కనిపించనున్నాడు. ఆయన పాత్ర మాస్, ఇంటెన్స్ షేడ్లతో ఆకట్టుకోనుందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం ‘పెద్ది’ అనే టైటిల్‌తో పాటు మరో రెండు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మార్చి 27న, రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల చేయనున్నారు. ఈ అప్డేట్తో మెగా ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.
మెగా మేనియా షురూ!
మెగా మాస్ పవర్, అద్భుతమైన కంటెంట్, బుచ్చిబాబు స్టైల్ నేరేషన్ – ఈ మూడూ కలిసొచ్చేలా, ‘RC16’ అంచనాలను తట్టిలేపేలా తెరకెక్కుతోంది. మరి, చరణ్ ఈ సినిమాలో ఏం కొత్తగా చూపించబోతున్నాడో చూడాలి!