సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ రివ్యూ

463
Sundeep Kishan A1 Express Review Rating

రేటింగ్ : 3.25/5
నటీనటులు : సందీప్ కిష‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌ తదితరులు
నిర్మాతలు : టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్‌ అగర్వాల్
దర్శకత్వం : డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను
సంగీతం : హిప్‌ హాప్‌ తమిళ
ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌
సినిమాటోగ్రఫీ : కెవిన్ రాజ్‌
విడుదల తేది : మార్చి 05, 2021

యంగ్ హీరో సందీప్ కిషన్ మార్చి 5న ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ని ట్రై చేశాడు. తెలుగులో హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా ఇదే..! తమిళంలో హిట్ అయిన ‘నాట్పే తునాయ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. సందీప్ కిషన్ 25వ సినిమా కావడంతో సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

కథ:

యానాంలోని చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌ కు గొప్ప చరిత్ర ఉంది. ఫ్రెంచ్ కాలనీల సమయంలో ఓ గొప్ప ఘటన.. తెగువ ప్రదర్శించిన చిట్టిబాబు స్మారకార్థం నిర్మించిన హాకీ గ్రౌండ్ లో కోచ్‌ మురళీ (మురళీ శర్మ) అక్కడి పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తుంటారు. ఆయన శిష్యులు ప్రతి ఏడాదీ నేషనల్స్ కు కూడా సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఆ గ్రౌండ్ ఉన్న ప్రాంతం మెడికల్ ల్యాబ్ కోసం చాలా ముఖ్యం.. దీంతో ఆ బడా కంపెనీ క్రీడాశాఖ మంత్రి రావు రమేశ్‌(రావు రమేశ్‌) తో ఒప్పందం కుదుర్చుకుంటారు. డబ్బుకు కక్కుర్తి పడ్డ రావు రమేశ్ ఆ క్లబ్ ను తొక్కేసి.. గ్రౌండ్ స్థలాన్ని లీజుకిచ్చేలా చేసి లాగేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టేస్తాడు. ఇక అప్పటికే బంధువుల ఇంటికి యానాంకు వచ్చిన సంజు(సందీప్ కిషన్).. విమెన్స్ హాకీ ప్లేయర్ లావణ్య(లావణ్య త్రిపాఠి) తో ప్రేమలో పడతాడు. ఆమె వెనకాల తిరుగుతూ ప్రేమను దక్కించుకునే సమయంలో.. లావణ్యకు ఆటలో అన్యాయం జరుగుతోందని భావించి సందీప్ సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. అతడొక స్టార్ ఆటగాడని ఆ గ్రౌండ్ లో ఉన్న వాళ్లందరికీ తెలిసిపోతుంది. ఇక సందీప్ ఎవరు..? హాకీని ఎందుకు వదిలేశాడు..? చిట్టిబాబు గ్రౌండ్ ను కాపాడడానికి సందీప్ ఎలాంటి సహాయం చేస్తాడు..? అన్నది వెండితెరపై చూడాలి.

నటీనటులు
సినిమాలో రెండే రెండు పాత్రలు గుర్తుండిపోతాయి.. ఒకటి హీరో సందీప్.. రెండోది విలన్ రావు రమేష్..! అలాగని మనుషులని పెట్టి కొట్టించే విలనిజం కాదు.. మాటతోనే అన్నీ చేస్తూ ఉంటాడు.. ఆ క్యారెక్టర్ ను చూస్తుంటే మనకు కూడా మండిపోతూ ఉంటుంది. క్రీడలను, క్రీడాకారులను దేశంలో ఇంతలా తొక్కేస్తున్నారా పొలిటీషియన్స్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది.

హాకీ ప్లేయర్ గా సందీప్ కిషన్ బాగున్నాడు. సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడు. హాకీ క్రీడాకారిణిగా లావణ్య‌ త్రిపాఠి పర్లేదు. మురళీ శర్మ హాకీ కోచ్ గా కనిపించాడు. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ముఖ్యమైన క్యారెక్టర్లు. సత్య, మహేశ్‌ విట్టా, పొసాని కృష్ణమురళి, రఘు బాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ:
తమిళంలో సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ‘నేటివిటీ’.. అలాంటిది తెలుగులో బాగా మిస్ అయినట్లు కనిపిస్తూ ఉంది. హాకీ గేమ్ ను కూడా ఏదో చూపించాలంటే చూపిస్తున్నాం అన్నట్లుగా దర్శకుడు తీసుకుని వెళ్ళాడు తప్పితే.. సగటు ప్రేక్షుకుడికి హాకీ గేమ్ గురించి చెప్పడంలో విఫలమయ్యాడు.

ఫస్ట్ హాఫ్ అలా సాగిపోతూ.. ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నది బాగా ఉండేలా చూసుకున్నాడు. కానీ సెకండాఫ్ లో గ్రౌండ్ చుట్టూ జరిగే రాజకీయాలను చూస్తున్నప్పుడు ఆల్ రెడీ చూసిన సినిమాల్లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత హీరో ఫ్లాష్ బ్యాక్ అంత గొప్పగా ఏమీ అనిపించదు. అప్పుడప్పుడు ఎలివేషన్స్ ఇచ్చినా మరీ అంతగా కథలో ఇమడలేకపోయాయి.

ఆఖరి 20 నిమిషాలు హాకీ మ్యాచ్ పర్లేదు. కానీ సీరియస్ సీన్లలో కామెడీ మాత్రం సినిమాకు మైనస్ గా చెప్పుకోవచ్చు. హిప్‌ హాప్‌ తమిళ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. సింగిల్ కింగులం పాట ఎంజాయ్ చేస్తారు..! కానీ ఆ పాట కూడా కథలో వేగాన్ని అడ్డుకుంటుంది. కెవిన్ రాజ్‌ సినిమటోగ్రఫి, చోటా కె. ప్ర‌సాద్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. కొన్ని అనవసరమైన సీన్స్ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. రొటీన్‌ స్టోరీ కూడా ఆడియన్స్ కు ఇంపాక్ట్ ఇవ్వదు. చూసిందే కదా హీరో ఎలాగూ గెలుస్తాడు అని మైండ్ లో ఫిక్స్ అయిపోవడం కూడా సినిమాకు మైనస్ అయ్యాయి.