నేచురల్ స్టార్ నాని.. వరుస విజయాలతో దూసుకుపోతూ ఉన్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కూడానూ..! ఇప్పటికే ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్న నాని.. తాజాగా తన కొత్త చిత్రం గురించిన అప్డేట్ కూడా ఇచ్చేశాడు. నానితో నిన్ను కోరి సినిమా తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ చిత్రానికి ‘టక్ జగదీష్’ అని టైటిల్ పెట్టారు. నానికి జంటగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత పెళ్లి చూపులు భామ రీతూ వర్మ తెలుగులో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో వెనక్కు తిరిగి తన టక్ ను సర్దుకుంటున్నట్టుగా ఉన్నాడు నాని. నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ‘నిన్ను కోరి’ హిట్ ను రిపీట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ కథ గోదావరి నేపథ్యంలో నడుస్తుందనేది ఫిలింనగర్ వర్గాల టాక్. గోదావరి యాసలోనే నాని మాట్లాడతాడని అంటున్నారు.
నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆ సినిమాలో సుధీర్ బాబు కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ‘వి’ సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉండబోతోందని నాని ఇప్పటికే చెప్పేశాడు. ఆ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉండగానే ‘టక్ జగదీష్’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. నాని నిర్మాతగా మారి ‘విశ్వక్ సేన్’ ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే..! నాని నిర్మాతగా గతంలో ‘అ!’ సినిమా ప్రశంసలను.. మంచి కలెక్షన్లను రాబట్టింది. 2020 నాని కేరీర్ లో ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి.