Actress Khushbu Sundar meets with accident and Escapes Unhurt

ప్రముఖ తమిళ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు కుష్బూకు బుధవారం త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. చెన్నైలోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఆ సమయంలో కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఖుష్బూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం నుంచి కుష్బూ ఎలాంటి గాయాలు కాకుండా త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం నుజ్జునుజ్జయింది. కుష్బూ డ్రైవర్ పక్కన కూర్చోవడంతో సురక్షింతంగా బయటపడ్డారు.

వేల్‌ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రయత్నంలో భాగంగా నవంబరు 6వ తేదీ నుంచి డిసెంబరు 6వరకు తమిళనాడులో బీజేపీ వేల్‌ యాత్ర చేపట్టింది. ఇందులో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొంటున్నారు. తిరుత్తణిలో ప్రారంభమైన ఈ యాత్ర డిసెంబర్ 6న తిరుచ్చెందూరులో ముగియనుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు వెళ్తుండగానే కుష్బూ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక కారు ప్రమాద ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని.. అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఖుష్బూ వెల్లడించారు.