ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా కూడా అభిమానులకు పండగే..! దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా..! ఇప్పటివరకూ షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి కానీ.. ఎటువంటి లీక్ లు కూడా జరగకుండా చాలా జాగ్రత్త పడుతోంది ఆర్ఆర్ఆర్ టీమ్.
అల్లూరి సీతా రామరాజుగా ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ నటిస్తుండగా.. కొమురం భీమ్ గా తారక్ దుమ్ము రేపబోతున్నారు. వీరిద్దరి గెటప్ లకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క లుక్ కూడా బయటకు రాలేదు. కానీ వీరి మీద అభిమానంతో ఫ్యాన్స్ కొన్ని అద్భుతమైన పోస్టర్లను సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నారు. రామ్ చరణ్ అప్పుడప్పుడు పలు ఈవెంట్స్ లో కనపడ్డంతో ఆయన ఆహార్యంపై అంచనాలు వచ్చేసాయి.. ముఖ్యంగా మీసకట్టు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు తారక్ కు సంబంధించిన లుక్ బయటకు వచ్చింది.
విశాఖ ఏజెన్సీలోని మోదాపల్లి, డల్లాపల్లి మండలాల్లోని కాఫీ తోటల్లో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరగబోతోందని తెలుస్తోంది. ఈ షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి వైజాగ్ కు ఎన్టీఆర్ బయల్దేరారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఎన్టీఆర్ అభిమానుల కెమెరాలకు చిక్కారు. గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో ఎన్టీఆర్ కనిపించారు. దీంతో ఆయన్ను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సహాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ మీడియా కంటపడటంతో ఆయన వైజాగ్ వెళుతున్నారనే వార్త అందరికీ తెలిసిపోయింది. దీంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వైజాగ్ విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ నటించనుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటించనున్నారు.