Ram Gopal Varma (RGV) amma rajyam lo kadapa biddalu telugu movie review and rating
Ram Gopal Varma (RGV) amma rajyam lo kadapa biddalu telugu movie review and rating

సినిమా పేరు: అమ్మరాజ్యంలో కడపబిడ్డలు
రేటింగ్ : 2/5
తారాగణం: అజ్మల్ అమీర్, ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే, బ్రహ్మానందం, అలీ, నిధి కుశలప్ప, ధీరజ్ కె.వి., అరవింద్ రావ్, ధన్‌రాజ్, రాం చైతన్య, జబర్దస్త్ రాము, స్వప్న, కత్తి మహేశ్, శ్రీ సాయిదుర్గ
సంగీతం: రవిశంకర్
సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాత: అజయ్ మైసూర్
దర్శకత్వం: సిద్ధర్థ తాతోలు
బ్యానర్స్: టైగర్ కంపెనీ ప్రొడుక్షన్స్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 12 డిసెంబర్ 2019

తను తీసే ఎలాంటి సినిమా అయినా సరే వివాదాలతో హడావిడి చేసే రాం గోపాల్ వర్మ ఏపి రాజకీయ నేపథ్యంతో తెరకెక్కించిన సినిమా అమ్మరాజ్యంలో కడప బిడ్డలు. మొదట ‘కమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ అనే పేరుతో సినిమా తీసి, సెన్సార్ అభ్యంతరాలతో రాజీపడి, ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’గా టైటిల్‌ను మార్చిన రాంగోపాల్ వర్మ, ఎన్నో గొడవలతో పూర్తి చేసుకున్న ఈ సినిమా నిన్న సెన్సార్ క్లియరెన్స్ రాగా ఈరోజు సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఎన్నికల్లో అధికార వెలుగుదేశం పార్టీ (వీడీపీ) ఓడిపోయి, అంతదాకా ప్రతిపక్షంలో ఉన్న ఆర్‌సీపీ 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుంది. కేవలం 23 సీట్లను మాత్రమే తమ పార్టీ గెలుచుకోవడం, అనూహ్యంగా ఆర్సీపీ అధికారంలోకి రావడం జీర్ణించుకోలేకపోయిన వీడీపీ పార్టీ అధినేత బాబు, ఆయన తనయుడు ఆకాశ్ అలియాస్ చినబాబు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎలాంటి ఎత్తులు వేశారు, వాటిని ఆర్సీపీ అధినేత వీఎస్ జగన్నాథరెడ్డి ఎదుర్కోగలిగాడా, లేదా?.. రాష్ట్ర ప్రజలు తమ సిఎంగా జగన్నాథ్ రెడ్డిని ఎంచుకుంటారు. వెలుగుదేశం పార్టీ, మనసేన పార్టీలు కొత్త సిఎం ను టార్గెట్ చేస్తారు. వెలుగుదేశం పార్టీకి రాజకీయ వారసుడిగా చినబాబుని చేద్దామనే బాబు ఆలోచనలకు విరుద్ధంగా చినబాబు పనులు ఉంటాయి. పార్టీలో కూడా చినబాబు మీద విమర్శలు వస్తాయి. ఈలోగా మాజీ మంత్రి అయినేని రమా హత్య చేయబడతాడు. ఆ హత్యని చేధించేందుకు సిబిఐ ఆఫీసర్లు రంగంలోకి దిగుతారు. ఇంతకీ ఆ హత్య చేయించింది ఎవరు..? చివర్లో ఆర్జివి వచ్చి ఇచ్చిన ట్విస్ట్ ఏంటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

హాస్యాన్ని పంచిన పీపీ చాల్ పాత్ర
నటీనటులు
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్లు:

సరైన కథ లేకపోవడం
ముళ్లమీద కూర్చోపెట్టే స్క్రీన్‌ప్లే
చెవులు వాయగొట్టే రీరికార్డింగ్
ఒకే తరహా ఎక్స్‌ప్రెషన్స్‌తో భయపెట్టే నటులు
కడుపులో దేవినట్లుండే డైరెక్షన్

తారల అభినయం:

వీఎస్ జగన్నాథరెడ్డిగా ‘రంగం’ ఫేం అజ్మల్ అమీర్, బాబుగా ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే ప్రధాన పాత్రలు పోషించారు. అజ్మల్‌కు వాయిస్ సూట్ కాలేదు. అతను నోరు ఆడిస్తుంటే, ఇంకెవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ధనుంజయ్ యాక్టర్ కాదు కాబట్టి ఉత్సవ విగ్రహం తరహాలో ఎప్పుడూ ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తుంటాడు. బ్రహ్మానందం (బాబు కారు డ్రైవర్) ఏడెనిమిది సీన్లలో కనిపించి చివరలో ఒక్క డైలాగ్ మాత్రమే చెప్పారు. అలీ (స్పీకర్), ధీరజ్ కేవీ (చినబాబు అలియాస్ ఆకాశ్), నిధి కుశలప్ప (బాబు కోడలు రమణి), శ్రీసాయిదుర్గ (ఆర్సీపీ ఎమ్మెల్యే పూజ), శ్రీకాంత్ అయ్యంగార్ (దయలేని రమ), అరవింద్ రావ్ (మనసేనాని), జబర్దస్త్ రాము (పీపీ చాల్), ధన్‌రాజ్ (గంగవీటి భవాని), సిట్ ఆఫీసర్ (స్వప్న), సీబీఐ ఆఫీసర్ (కత్తి మహేశ్) సినిమాలో పాత్రధారులుగా భాగమయ్యారు.

విశ్లేషణ:

కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని పెట్టిన ఈ సినిమా టైటిల్ కాస్త అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చారు. అయితే టైటిల్ ఒక్కటే మారింది కాని సినిమా కంటెంట్ మాత్రం ఆర్జివి సినిమాతో ఏం చెప్పాలని అనుకున్నాడో అది చెప్పాడు. ఇది స్పూఫింగ్ సినిమా. అంటే ఈ సినిమాలోని క్యారెక్టర్లు రియల్ లైఫ్‌లోని పలు పొలిటికల్ లీడర్లను పోలి కనిపిస్తుంటాయి. సినిమా మొదట్లో వేసిన డిస్‌క్లైమర్‌లో ‘ఇందులో పాత్రలు, సన్నివేశాలు, ప్రదేశాలు ఎవర్నీ ఉద్దేశించినవి కావు, అంతా తూచ్’ అని చెప్పుకున్నారు. అయినప్పటికీ అనేక పాత్రలు మనకు అవి ఎవర్ని ఉద్దేశిస్తున్నాయో స్పష్టం చేస్తుంటాయి.

జగన్నాథ్ రెడ్డి సిఎంగా ప్రమాణస్వీకారం చేస్తుంటే చినబాబు గదిలో దూరి కన్నీళ్లు పెట్టుకునే సీన్.. తాను సిఎంగా ప్రమాణ స్వీకారం ఎలా చేయాలో ప్రిపేర్ అయ్యే సీన్ తో వర్మ టార్గెట్ ఎవరన్నది తెలుస్తుంది. ఒక పార్టీని పూర్తిగా డీగ్రేడ్ చేసే విధంగా, మరో పార్టీని అందలం ఎక్కించే విధంగా, ఒక పార్టీ నాయకుల్ని విలన్లుగా, ఇంకో పార్టీ నాయకుడిని హీరోగా చూపించే సీన్లు రాసుకొని, వాటిని ఒకదారానికి గుచ్చి సినిమాగా తీసి జనం మీదకు వదిలారంతే. దాంతో సహజంగానే ఒక పార్టీ వాళ్లకు ఈ సినిమా చేదుగా, ఇంకో పార్టీ వాళ్లకు తియ్యగా ఈ సినిమా కనిపిస్తుంది.

సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగా ప్రస్తుతం ఏపి లో అధికార, ప్రతి పక్ష పార్టీల మధ్య జరుగుతున్న గొడవల గురించి వర్మ ఈ సినిమా చేశాడు. కేవలం ఆ వ్యక్తులను వాడుకుని సినిమా నడిపించాడు. బాబు, చినబాబు, మనసేన అధినేత ఇలా అందరి మీద వర్మ తన కసి చూపించాడు. అయితే సినిమాలో ఇంటర్వల్ ట్విస్ట్ ఎవరు ఊహించలేదు అయినేని రమ హత్య ఆ హత్యను ఎవరు చేయించారన్న సస్పెన్స్ కలిగించాడు. అంటే భవిష్యత్తులో ఆ నాయకుడు హత్యకు గురవుతాడని జోస్యం చెబుతున్నారన్న మాట. పైగా దయలేని రమ తమ పార్టీవాడిని తామే హత్య చేసి, ఆ హత్యను ముఖ్యమంత్రి పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తే, అది వికటించి, అతడే హత్యకు గురవుతాడు.

అయితే సెకండ్ హాఫ్ మొత్తం ఆ హత్య ఎవరు చేయించారన్న కథ మీదే నడుస్తుంది. ఇక ఈ సినిమాలో కథ చాలా వీక్ అని చెప్పొచ్చు. కథనం కూడా అంత గ్రిప్పింగ్ గా ఏమి లేదు.క్లైమాక్స్‌లో మధ్యంతర ఎన్నికల్లో ఆర్సీపీ పార్టీ మొత్తం 175 సీట్లలో 174 సీట్లు గెలుచుకుందనీ, దీనికి కారణం దయలేని రమ హత్యను జగన్నాథరెడ్డి చేయించలేదని జనం నమ్మారు కాబట్టే ఏకపక్షంగా గెలిపించారనీ స్వయంగా తెరపైకి వచ్చి రాంగోపాల్ వర్మ చెప్పారు. అప్పటివరకు ఇన్ డైరెక్ట్ గా కథలో పంచులేసిన వర్మ తను కనిపించి సినిమా ఎందుకు తీశాడో చెప్పాడు. సినిమా మొత్తమ్మీద పది పేజీల డైలాగ్స్ కూడా ఉండవు. ప్రధానంగా హావభావాలు, రీరికార్డింగ్‌తో సినిమాని నడిపారు.

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. వర్మ ఏమనుకున్నాడో అది తీశాడు..!

 

REVIEW OVERVIEW
Chitrambhalare
Previous articleహేజా తెలుగు మూవీ రివ్యూ
Next article‘సరిలేరు నీకెవ్వరు’ రొమాంటిక్ పోస్టర్ – దర్శనమిచ్చిన రష్మిక