Bellamkonda Srinivas Chatrapathi Hindi Trailer: హిందీ డబ్బింగ్ సినిమాలతో నార్త్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అతని ప్లాప్ చిత్రాలు సైతం యూట్యూబ్ లో మిలియన్ల కొలదీ వ్యూస్ దక్కించుకుంటాయి. ‘జయ జానకీ నాయక’ సినిమా యూట్యూబ్ లో వ్యూస్ పరంగా KGF ను క్రాస్ చేసిందంటే ఉత్తరాదిలో బెల్లంకొండ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.
Bellamkonda Srinivas Chatrapathi Hindi Trailer: తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ‘అల్లుడు శ్రీను’ సినిమాతో శ్రీనివాస్ ను టాలీవుడ్ లో హీరోగా లాంచ్ చేసిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్.. ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు. రిలీజ్ కు రెడీ అయిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మేకర్స్ ముంబైలో గ్రాండ్ గా ట్రైలర్ ను లాంచ్ చేశారు.
‘ఛత్రపతి’ హిందీ ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయే మాస్ అంశాలతో బాలీవుడ్ జనాలను ఆకట్టుకునేలా సాగింది. యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ ని మ్యాచ్ చేయటానికి బెల్లకొండ శ్రీనివాస్ బాగా కష్టపడ్డట్లు అర్థమవుతోంది. తెలుగు వెర్షన్ లో ఇండియా – శ్రీలంక నేపథ్యాన్ని చూపిస్తే.. ఇక్కడ మాత్రం హిందీ ఆడియన్స్ సెన్సిబిలిటేస్ కి దగ్గరగా ఉండేలా ఇండియా – పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో మదర్ సెంటిమెంట్ ను చూపించారు.
ఒరిజినల్ లో కంటే హిందీ ఛత్రపతిలో యాక్షన్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఫైట్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది ట్రైలర్ లో శాంపిల్ గా చూపించారు. అలానే రాజమౌళి తీసిన సినిమా కంటే గ్రాండ్ గా తీసే ప్రయత్నం చేశారు వినాయక్. ఇందులో సాయి శ్రీనివాస్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ నుష్రత్ బారుచ్చా హీరోయిన్ గా నటించింది. ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ హీరో తల్లి పాత్రలో కనిపించింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన శరద్ కేల్కర్ విలన్ గా నటించారు.
ఓవరాల్ గా ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ ట్రెయిలర్ హిందీ జనాలను ఆకట్టుకునేలా ఉంది. మాతృకతో కంపేర్ చేయకుండా చూస్తే, తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చే అవకాశం వుంది. ‘ఛత్రపతి’ ఒరిజనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ అందించగా.. మహదేవ్ స్క్రీన్ ప్లే రాశారు. తనీష్ బాగ్చి సంగీతం సమకూర్చగా.. KGF రవి బస్రురు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. నిజార్ సఫీ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
‘ఛత్రపతి’ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ గడ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సమ్మర్ స్పెషల్ గా మే 12న గ్రాండ్ గా రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి యాక్షన్ మూవీ బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్టర్ వి.వి వినాయక్ లకు బాలీవుడ్ లో ఎలాంటి ఎంట్రీని అందిస్తుందో చూడాలి.