bhalegundi baalaa song lyrical video from sharwanand sreekaram released

Bhalegundi Baalaa Song: శర్వానంద్ హీరోగా వస్తోన్న సినిమా ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. కిశోర్ బి దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇటీవలే తిరుపతిలో ఒక షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ఈ క్రమంలో తాజాగా ‘శ్రీకారం’ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘భలేగుంది బాలా’ ఫోక్ సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేశారు.

ఇదిలా ఉంటే, ‘వచ్చానంటివో.. పోతానంటివో.. వగలు పలుకుతావే.. కట్టమీద పోయే అలకల సిలికా.. భలేగుంది బాలా..’ అంటూ సాగిన ఈ పాటను రాయలసీమ జానపద కళాకారుడు పెంచల్ దాస్ ఆలపించారు. ఈ పాటకి ఆయనే సాహిత్యాన్ని అందించడం విశేషం. ‘అరవింద సమేత’ సినిమాకు కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు మరో మంచి ఫోక్ మెలోడీతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ఈ పాట అలిగిన ప్రేయసిని ప్రియుడు బుజ్జిగిస్తున్న నేపథ్యంలో వస్తుందని తెలుస్తోంది. ఈ సాంగ్ లో శర్వానంద్ లుంగీ కట్టుకొని పల్లెటూరి యువకుడిగా కనిపిస్తుండగా.. ప్రియాంక మోహన్ లంగావోణీ లో పల్లెటూరి అమ్మాయిలాన అందంగా ఉంది.

ఎప్పుడూ ఆహ్లాదకరమైన మెలోడీలు అందించే మిక్కీ జే మేయర్ ఈసారి మాత్రం మాస్ బీట్‌తో ఇరగదీశారు. ‘శ్రీకారం’ చిత్రానికి ఈ పాట ప్రత్యేక ఆకర్షణ కావడం ఖాయం. పెంచల్ దాస్ గానమే కాదు సాహిత్యం కూడా అంతే గొప్పగా ఉంది. భలేగుంది బాలా పాటకు దినేష్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు. జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. కాగా, ఈ చిత్రంలో రావు ర‌మేష్‌, ఆమ‌ని, సీనియ‌ర్ న‌రేష్‌, సాయికుమార్‌, ముర‌ళీశ‌ర్మ, స‌త్య, స‌ప్తగిరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ని ఇటీవలే ప్రారంభించారు.