Bholaa Shankar Release date: ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ”భోళా శంకర్” చిత్రంలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా ఖరారు చేసారు.
Bholaa Shankar Release date: ‘భోళా శంకర్’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఉగాది పండుగను పురస్కరించుకుని ఓ స్పెషల్ పోస్టర్ ను ఆవిష్కరించడమే కాదు.. విడుదల తేదీని కూడా ప్రకటించారు.
2023 ఆగస్ట్ 11న ‘భోళా శంకర్’ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కీర్తి, తమన్నా సోఫాలో కూర్చొని ఉండగా.. చిరు వారి వెనుక నిలబడి ఉన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ ముగ్గురి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ ను వెల్లడించడంతో SSMB28 ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాను ఈ యేడాది ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అదే డేట్ మీద మెగా కర్చీఫ్ పడిపోయింది.
చిరంజీవి – మహేష్ బాబుల మధ్య అనుబంధాన్ని బట్టి చూస్తే, ఒకరికొకరు పోటీ పడే అవకాశం లేదు. మరోవైపు నిర్మాత అనిల్ సుంకరకు కూడా మహేష్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. కనుక SSMB28 సినిమా వేరే తేదీకి మారాల్సిందే. ఇదంతా చూస్తుంటే మహేష్ – త్రివిక్రమ్ ల మూవీ 2024 సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇకపోతే తమిళ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘వేదాళమ్’ చిత్రానికి తెలుగు రీమేక్ గా ‘భోళా శంకర్’ చిత్రం తెరకెక్కుతుంది. అన్నాచెల్లెళ్ల బంధం చుట్టూ తిరిగే ఈ మూవీలో.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.