టాలీవుడ్ కమెడియన్స్ సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్, వైవా హర్ష ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భువన విజయమ్’. కొత్త దర్శకుడు యలమంద చరణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసి, విడుదల తేదీని ప్రకటించారు.
ధనరాజ్ ను యమలోకానికి తీసుకెళ్లడానికి వచ్చిన ఇద్దరు యమ భటులు.. పనిలో పనిగా చనిపోవడానికి రెడీగా ఉన్న మరో వ్యక్తి ఆత్మని కూడా తీసుకెళ్లడానికి ఓ సినిమా ఆఫీసుకు వెళ్లడంతో ‘భువన విజయమ్’ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ కేవలం కామెడీ యాంగిల్ ను మాత్రమే చూపిస్తే.. ఈ ట్రైలర్ మాత్రం అన్ని ఎమోషన్స్ కలబోసిన సినిమాను చూడబోతున్నామని హామీ ఇస్తోంది.
ఇందులో ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్ పాత్రలో సునీల్ కనిపించాడు. ‘తేల్చుకోమని లోపలికి పంపిస్తే, అరుచుకుంటున్నారేంటిరా.. అసలు కథ మొదలెట్టండి’ అని సునీల్ చెప్పడంతో.. సినిమాలో అసలు డ్రామా ఏంటో ఈ ట్రెయిలర్ లో లైట్ గా చూపించారు. సినిమాలో ఫన్ మాత్రమే కాదు.. సెంటిమెంట్, ఫాంటసీ, సినీ రంగం మీద సెటైర్లు ఉన్నాయని హింట్ ఇచ్చారు. సినిమా నిర్మాణంలో నిర్మాతల ఆర్థిక ఇబ్బందులు, వర్థమాన దర్శక రచయితల కష్టాలు వంటివి ఈ చిత్రంలో టచ్ చేసినట్లు తెలుస్తుంది.
మొత్తం మీద ఆసక్తికరంగా సాగిన ‘భువన విజయమ్’ ట్రెయిలర్.. ఈ సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేసిందని చెప్పాలి. ఇందులో సునీల్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, ధనరాజ్ లతో పాటుగా బిగ్ బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్, సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తిపండు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
‘భువన విజయమ్’ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి సాయి సినిమాటోగ్రఫీ అందించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేశాడు.
భువన విజయమ్ మూవీని మే 12న థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాకపొతే అదే రోజున అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమాతో పాటుగా మరికొన్ని చిత్రాలు వస్తున్నాయి. మరి వాటిని తట్టుకొని ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.