Bichagadu 2 Telugu Trailer: వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని (Vijay Antony). అతని కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘బిచ్చగాడు’ (పిచ్చైకారన్). 2016లో ఎలాంటి అంచనాలు లేకుండా, సైలెంట్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా “బిచ్చగాడు 2” వస్తోంది.
Bichagadu 2 Telugu Trailer: ఇప్పటికే ‘బిచ్చగాడు 2’ ప్రచార చిత్రాలు, స్నీక్ పీక్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే బికిలి, చెల్లి వినవే పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మే నెలలో రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ను ఈరోజు శనివారం చిత్ర బృందం లాంచ్ చేసింది. విజయ్ ఆంటోనిని (Vijay Antony) పవర్ ఫుల్ క్యారెక్టర్ లో పరిచయం చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
‘విజయ గురుమూర్తి.. ఇండియాలోనే సెవెంత్ రిచెస్ట్ మ్యాన్.. ఒక లక్ష కోట్లకు వారసుడు’ అంటూ చెప్పే వాయిస్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో విజయ్ ఆంటోనీ ఓవైపు బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తూనే మరోవైపు అయ్యప్పమాల ధరించి పైట్స్ చేస్తున్నాడు. ‘బిచ్చగాడు’ సినిమా అమ్మ సెంటిమెంట్ మీద నడిస్తే.. ఈ సీక్వెల్ లో చెల్లి సెంటిమెంట్ ని టచ్ చేసినట్లు ట్రైలర్ (Trailer) లో హింట్ ఇచ్చారు.
తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు కోసం ఓ కోటీశ్వరుడు 40 రోజుల పాటు బిచ్చగాడిగా మారితే ఎలా ఉంటుందనేది ఫస్ట్ పార్ట్ లో చూపించారు. అయితే ‘బిచ్చగాడు 2’ కథేంటి అనేది తెలియకుండా.. మొదటి భాగానికి మించి ఏదో ఉంటుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ట్రెయిలర్ కట్ చేశారు. యాంటీ బికిలి అనే అంశాన్ని హైలెట్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ నుంచి యాక్టర్ గా మారిన విజయ్ ఆంటోని.. ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) చిత్రానికి అన్నీ తానై నడిపిస్తున్నాడు. ఇందులో హీరోగా నటించడమే కాదు.. స్టోరీ రాసుకోవడమే కాదు.. మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ అవతారమెత్తాడు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ అనే సొంత బ్యానర్ లో తన భార్య ఫాతిమా విజయ్ పేరు మీదుగా నిర్మించారు. ఎడిటింగ్, మ్యూజిక్ విభాగాలు కూడా విజయే చూసుకున్నాడు.
‘బిచ్చగాడు 2’ ట్రెయిలర్ లో విజయ్ ఆంటోని ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఓం నారాయణ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సెటప్, పెద్ద బిల్డిగ్స్, ఫారిన్ లోకేషన్స్ చూస్తుంటే గ్రాండియర్ గా చాలా బడ్జెట్ పెట్టి సినిమాని రిచ్ గా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ‘ఏక్ మినీ కథ’ ఫేమ్ కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. దేవ్ గిల్, రాధా రవి, వై జి మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడి, జాన్ విజయ్, యోగి బాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
‘బిచ్చగాడు 2’ చిత్రాన్ని మే 19వ తేదీన పాన్ ఇండియా వైడ్ గా థియేటర్స్ లోకి తీసుకురానున్నట్లు విజయ్ ఆంటోనీ టీమ్ ప్రకటించింది. తమిళంలో ‘పిచ్చైక్కరన్ 2’, తెలుగులో ‘బిచ్చగాడు 2’, కన్నడలో ‘భిక్షుకా 2’, మళయాళంలో ‘భిక్షాక్కరన్ 2’ పేర్లతో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.