రామ్ గోపాల్ వ‌ర్మ.. ఈయన బయోపిక్ లు తీయని వాళ్లంటూ లేరే..! పెద్ద పెద్ద గ్యాంగ్ స్టర్స్ దగ్గర నుండి.. బడా రాజకీయనాయకుల వరకూ అందరినీ వర్మ కెలికేశాడు. అలాంటి వర్మ మీద బయోపిక్ తీస్తానని కొద్దిరోజుల క్రితం ప్ర‌ముఖ ర‌చ‌యిత జొన్న‌విత్తుల సినిమా తీయ‌నున్నానంటూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అదేదో కోపంలో అన్న మాట అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ విషయంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిలింనగర్ వర్గాల భోగట్టా..!

ప‌లువురు ప్ర‌ముఖుల‌ జీవితాల‌పై సినిమాలు తీసిన‌ రామ్ గోపాల్ వ‌ర్మ అనేక‌ సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న జీవితంపై సినిమా రాబోతుంది. వ‌ర్మ పైశాచికం, ఆయ‌న విచ్చ‌ల‌విడిత‌నంపై ప్ర‌ముఖ ర‌చ‌యిత జొన్న‌విత్తుల సినిమా తీయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌కటించాడు. అన్న‌ట్టుగానే వ‌ర్మ బ‌యోపిక్ సినిమాకి సంబంధించి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. వర్మ బయోపిక్ కు సంబంధించి సినిమా ప‌నులు ప్రారంభించార‌ట‌ జొన్న విత్తుల. వర్మలా ఉండే ఓ వ్యక్తిని.. బీహార్ నుంచి పట్టుకొచ్చాడ‌ని కూడా అంటున్నారు.. అతడికిన‌ట‌న‌లో శిక్ష‌ణ ఇప్పిస్తుండ‌డంతో పాటు వ‌ర్మ మేన‌రిజాన్ని అనుక‌రించేలా ట్రైనింగ్ ఇస్తున్నారంటూ ప్రచారం కూడా మొదలైంది. అది నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విషయంలో వర్మకు పెద్ద షాక్ తగిలిందని తెలుస్తోంది. ఎందుకంటే అనుకున్న సమయానికి సినిమా విడుదల కాలేదు. సెన్సార్ వాళ్ళు ఈ సినిమాను చూసి షాక్ తిన్నారంటే ఎంతమందిని కెలికాడో వర్మ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు.. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, వివాదాస్పద అంశాలున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖులను కించపరిచే సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. అంతేకాకుండా కొందరు నాయకుల దగ్గర నుండి క్లీన్ చిట్ తీసుకొని రమ్మని చెప్పారంటూ వస్తున్న వార్తలు కూడా కలవరపెడుతున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం చూసినప్పుడు ఈ సినిమా ఐడియా వచ్చిందని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపించటం లేదనీ.. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేసుకున్నానన్నారు. తాను ఎవరినీ టార్గెట్‌ చేసి సినిమా చేయనని కేవలం తనకు ఇంట్రస్టింగ్‌గా అనిపించిన పాయింట్‌ను మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తానని అన్నారు వర్మ. క్రైమ్‌ కన్నా.. పొలిటికల్‌ క్రైమ్‌ మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని కూడా అన్నారు వర్మ. ఈ సినిమాను ఓ ప్రముఖ తండ్రి కొడుకులకు అంకిత ఇవ్వనున్నానన్నారు. అయితే వారి పేర్లు మాత్రం అడగవద్దన్నారు.