కంగ‌నా ర‌నౌత్ ఆఫీసు కూల్చివేత‌..!

0
535
bmc carries out demolition at kangana ranauts office in mumbai

Kangana Ranaut office demolition: బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఆఫీసును బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఇవాళ కూల్చివేశారు. ముంబైలోని పాలి హిల్స్‌లో ఆ ఆఫీసు ఉన్న‌ది. బాంద్రా బంగ్లాలో అక్ర‌మంగా మార్పులు జ‌రిగిన‌ట్లు బీఎంసీ అధికారులు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఇంటికి నోటీసులు అంటించిన‌ట్లు బీఎంసీ అధికారులు చెప్పారు.

బీఎంసీ అధికారులు బుల్డోజ‌ర్లతో బుధవారం మ‌ధ్యాహ్నం 12.30 గంటలకు కంగ‌న ఆఫీసు వద్దకు వెళ్లారు. ఆ వెంటనే బిల్డింగ్‌ కూల్చివేత ప్రారంభించారు. బుధవారం ఉదయమే తన స్వస్థలం నుంచి ముంబై బయల్దేరిన కంగన.. కూల్చివేతలకు సంబంధించిన విషయం తెలుసుకొని మహారాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రమైన విమర్శలు చేశారు. వరుస ట్వీట్లతో సంచలన ఆరోపణలు చేశారు.

త‌న బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన ఫోటోల‌ను కంగ‌నా ట్వీట్ చేసింది. నేనెప్పుడూ త‌ప్పు చెప్ప‌లేదు, నా శ‌త్రువులు నిజ‌మ‌ని ప్రూవ్ చేశారు, అందుకే ఇప్పుడు ముంబై పీవోకేగా మారింద‌ని త‌న ట్వీట్‌లో కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి, కంగనాకు మాట‌ల యుద్ధం సాగింది. శివ‌సేన పార్టీతో వైరానికి దిగిన కంగ‌నా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ముంబై పోలీసుల తీరును కూడా ఖండించింది.

ఆమె తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. బిల్డింగ్ కూల్చివేత‌ను అడ్డుకోవాలంటూ కంగ‌నా త‌ర‌పు న్యాయ‌వాది ముంబై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కూల్చివేతలను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.