bollywood actress alia bhatt will join in rrr shooting

alia bhatt RRR Shooting: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌తో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగులకు అంతరాయం కలగడంతో ‘ఆర్ఆర్ఆర్’ కూడా వాయిదా పడిపోయింది. కొవిడ్ నిబంధనల ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ తిరిగి మొదలైంది.

రామ్‌చరణ్, ఎన్టీఆర్ కూడా షూటింగులో పాల్గొంటున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కు జంటగా సీత పాత్రలో నటిస్తున్న ఆలియా భట్ ఇప్పటివరకు యూనిట్‌తో కలవలేదు. తాజాగా ఆమె రాకకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే సెట్‌కు రానున్న ఆలియా నవంబర్ నుంచి ఏకధాటిగా షూటింగులో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో దానిలోని క్లిప్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌పై ఇప్పటికే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.