టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్ గా కనిపించనున్నారు. ‘బాహుబలి’ తరవాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నుంచి వస్తోన్న మరో భారీ చిత్రం కావడంతో సాధారణంగానే RRRపై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. అయితే, ఈ అంచనాలను మరింత పెంచడానికి.. సినిమాను మరింత భారీ తననాన్ని తీసుకురావడానికి రాజమౌళి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ సినిమాకి స్టార్లతో వాయిస్ ఓవర్ చెప్పించాలని చూస్తున్నాడు.
ఒక స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం టాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి ఆకర్షణనే RRR సినిమాకు తీసుకొచ్చేందుకు రాజమౌళి ప్లాన్ చేశారట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఆయా భాషలకు సంబంధించిన సూపర్ స్టార్లతో ఈ సినిమా నేపథ్యాన్ని వాయిస్ ఓవర్ ద్వారా చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడని అంటున్నారు. దీనిలో భాగంగా హిందీలో ఆమిర్ ఖాన్‌తో తెలుగులో చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించబోతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.
దీనికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. హిందీలో సైతం ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషించిన పాత్రలను పరిచయం చేయడానికి ఆమిర్ ఖాన్ అంగీకరించారని రూమర్స్. ఈ వదంతుల్లో నిజమెంతో తెలీదు కానీ చిరంజీవి, ఆమిర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇస్తే అది కచ్చితంగా RRRకు అదనపు ఆకర్షణ అవుతుంది.