Chiranjeevi and Manisharma is a golden combo For Koratala Siva movie
Chiranjeevi and Manisharma is a golden combo For Koratala Siva movie

ఒక దశాబ్దానికి పైగా తెలుగు సినిమా సంగీతంలో తిరుగులేని ఆధిపత్యం చలాయించాడు మణిశర్మ. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకి సంగీత దర్శకుడిని తీసుకోవాలి అంటే అందరూ మణిశర్మ నే ప్రిఫర్ చేసే వారు. చిరంజీవి ‘ఇంద్ర’ ‘ఠాగూర్’.. బాలకృష్ణ ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహా నాయుడు’ ‘లక్ష్మీ నరసింహా’ , ఎన్టీఆర్ ‘ఆది’.. మహేష్ బాబు ‘ఒక్కడు’ ‘పోకిరి’.. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ వంటి సినిమాలకు ఈయన ఇచ్చిన సంగీతం అలాగే నేపధ్య సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది అనడంలో సందేహం లేదు. కానీ దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి యువ సంగీత సంచలనాల రాకతో ఆయన జోరు తగ్గింది. క్రమంగా సినిమాలు తగ్గిపోయాయి. ఒక దశలో మణిశర్మ పేరే వినిపించలేదు.

కొన్ని పెద్ద సినిమాలకు నేపథ్య సంగీతం అందించడం.. చిన్న సినిమాలకు సంగీతం సమకూర్చడం ద్వారా మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చే ప్రయత్నం చేశాడు కానీ.. మళ్లీ మునుపటి స్థాయిని మాత్రం అందుకోలేకపోయాడు. నాని హీరోగా వచ్చిన ‘జెంటిల్ మెన్’, నితిన్ హీరోగా వచ్చిన ‘లై’ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినప్పటికీ ఎందుకో కోలుకోలేకపోయాడు. ఇలాంటి సమయంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా మణిశర్మ కెరీర్‌ను భలేగా మలుపు తిప్పింది. ఈ సినిమాలో ఊర మాస్ పాటలతో, నేపథ్య సంగీతంతో హోరెత్తించేశాడు మణిశర్మ.

యావరేజ్ కంటెంట్ ఉన్న ఈ సినిమాకి ఈయన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపాడు. సరైన ఛాన్స్ వచ్చి.. తాను మనసు పెట్టి చేస్తే ఈ తరం యువతను కూడా ఒక ఊపు ఊపేయగలనని చాటుకున్నాడు మణిశర్మ. దీంతో కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న మెగాస్టార్ 152 వ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ కొట్టేసాడు. అంతేకాదు ఇప్పుడు వెంకటేష్ హీరోగా రూపొందుతోన్న ‘అసురన్’ తెలుగు రీమేక్ కు కూడా మణిశర్మ ను సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టు టాక్ నడుస్తుంది. కొరటాల సినిమా అంటే సంగీతానికి ఉండే ప్రాధాన్యం గురించి చెప్పాల్సిన పని లేదు. ‘అసురన్’ రీమేక్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలకం. అందులో మణిశర్మ కింగ్. కాబట్టి ఈ రెండు సినిమాలతో మణిశర్మ పేరు ఖాయం.