Chiranjeevi Balakrishna Flight Cross In Agriculture Lands In Nellore District Before 27 Years

1993 నవంబర్ 15న మద్రాస్ నుంచి హైదరాబాద్‌ మీదుగా దేశ రాజధాని ఢిల్లీ వెళ్లేందుకు ఓ విమానం బయలుదేరింది. ఇందులో సినీతారలు చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, బ్రహ్మానందం సహా అనేకమంది సినీ తారలతో కలిపి మొత్తం 247 ప్రయాణికులు ఉన్నారు. తెలుగు సినీ పెద్దలంతా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆకాశం మేఘావృతం అయ్యింది. విమానంలో ఉన్న సినిమావాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో పొగమంచు అధికంగా ఉండటంతో విమానం ట్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో విమానం మద్రాస్‌ వెనుదిరిగింది.

ఆ సమయంలోనే నెల్లూరు జిల్లా ఆవరణ లోకి వచ్చిన తర్వాత విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నట్లు పైలట్లు అనౌన్స్ చేయడంతో విమానంలో ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. కానీ ఫైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వారి ప్రాణాలు కాపాడారు. చివరకు సినీ నటులు సిబ్బంది హమ్మయ్య అనుకున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం జరిగింది ఈ ఘటన. సినీతారలు ప్రయాణిస్తున్న వాహనం పంట పొలాల్లో దిగిందన్న వార్త తెలుసుకున్న తెలుగు సినీ ప్రేక్షకులు షాకయ్యారు. సమీప ప్రాంతాల్లోని ప్రజలందరూ సంఘటనా స్థలానికి తండోప తండాలుగా తరలివచ్చారు. తమ అభిమాన తారలు క్షేమంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విమానం.. ఎయిర్ బస్ కంపెనీ ఏ 300 మోడల్. దానిఖరీదు రూ. 100 కోట్లు. 1976లో ఈ విమానాన్ని కొనుగోలు చేశారు. కానీ సాంకేతిక సమస్యలతో ఇబ్బంది తలెత్తింది. విమానాన్ని పంట పొలాల్లో క్రాష్ చేయకుండా మద్రాస్‌కు తీసుకెళ్తే మధ్యలోనే కూలిపోయేదని, పైలట్లు సాహసోపేత నిర్ణయం తీసుకోవడం వల్లే అందరూ ప్రాణాలతో బయటపడ్డారని నిపుణులు ప్రశంసించారు. ఇప్పటికీ ఈ ఘటన గురించి సినిమా వాళ్లు తలుచుకుంటూ ఉంటారు.