Chiranjeevi Comments On Disha Accused Encounter
Chiranjeevi Comments On Disha Accused Encounter

దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లిన సమయంలో దిశ కేసు నిందితులు పోలీసులపై దాడికి దిగి పారిపోతుంటే, ఎన్ కౌంటర్ చేశారు. ఆ సమయంలో పోలీసులకూ గాయాలు అయ్యాయి. దిశను కాల్చిన చోటు నుంచి పరుగు ప్రారంభించిన నలుగురు నిందితులూ, అక్కడి దొరికిన రాళ్లను పోలీసులపైకి విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు హెచ్చరించినా వారు వినలేదని అన్నారు. ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారని అన్నారు. ఆ తర్వాత కాల్పులు ఆగిపోయాయని, అనంతరం చూస్తే నలుగురూ చనిపోయి కనిపించారని చెప్పారు.

ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. టాలీవుడ్ పెద్ద, మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఘటనపై స్పందించారు. దిశకు ఇది నిజమైన నివాళి అని, ఆమె తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్టయిందని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులపై ఆయన ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి నా అభినందనలు.. తెలంగాణ పోలీసులకు నా సెల్యూట్ అని ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చిరంజీవి వ్యాఖ్యలకు కాస్త విరుద్ధంగా ఉన్నాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘటనలు మరోసారి జరగవని అనుకోవద్దని, మహిళలపై దారుణాలకు పాల్పడే మృగాళ్లను వదిలిపెట్టకూడదని అన్నారు. కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలని.. కేవలం రెండు, మూడు వారాల్లోనే దోషులకు శిక్షలు పడేలా నిబంధనలు తీసుకురావాలని పవన్ అన్నారు. గతంలో నిర్భయ ఘటన తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్‌ తీసుకొచ్చినప్పటికీ అత్యాచారాలు ఆగలేదని అన్నారు. మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అమ్మాయిల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠిన చట్టాలు చేయాలని ఆయన అన్నారు.