కె.రాఘవేంద్రరావు ‘‘పెళ్లిసందడి’’ మళ్లీ మొదలవ్వబోతుంది..
కె.రాఘవేంద్రరావు ‘‘పెళ్లిసందడి’’ మళ్లీ మొదలవ్వబోతుంది..

PelliSandadi: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాస్త గ్యాప్‌ తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన ‘పెళ్లి సందడి’ సినిమా చేయబోతున్నానని చెబుతూ.. ‘#PelliSandadi… మళ్ళీ మొదలవ్వబోతుంది…. తారాగణం త్వరలో…’ అని రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు.

లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ ‘మంచి పాటలతో..’ అని ట్వీట్‌ చేశారు. కె.కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్‌.కె.ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకాలపై సినిమా రూపొందనుంది. ఎం.ఎం.కీరవాణ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి శివశక్తిదత్తా, చంద్రబోస్‌ పాటలను రాస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు.

ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ ప్రారంభమైందని, త్వరలోనే నటీనటులెవరనే విషయాన్ని తెలియజేస్తామని ఆయన తెలిపారు. కొత్త నటీనటులతో దర్శకేంద్రుడు ఈ సినిమా చేసే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.