director krish jagarlamudi launches the first single the guntur song from middle class melodies

The Guntur Song: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కిందటేడాది ‘దొరసాని’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. వింటేజ్ తెలంగాణ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. ఆనంద్ తన రెండో చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ దర్శకత్వంలో ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ప్రచారంలో భాగంగా సోమవారం తొలి పాటను విడుదల చేశారు. గుంటూరు నగరాన్ని వర్ణిస్తూ సాగిన ఈ అందమైన పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు. ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాశారు. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించారు. స్వీకర్ అగస్తి అద్భుతంగా స్వరపరిచారు. ఈ సాంగ్ ఆసాంతం గుంటూరునగర విశిష్టతను వివరిస్తూ సాగింది. గుంటూరులో ప్రముఖమైన అన్ని అంశాలు ఈ పాటలో చాలా చక్కగా కుదిరాయి. ఈ పాట వింటుంటే ఏ గుంటూరు వ్యక్తి అయినా మెస్మరైజ్ కాక తప్పరు. అందుకే, యూట్యూబ్‌లో ఈ పాటకు గుంటూరోళ్ల నుంచి విశేష స్పందన వస్తోంది. మొత్తానికి తొలి పాటతోనే ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’కి మంచి ప్రచారం లభించినట్లయింది.