disha encounter accused families protest of ram gopal varma office

RGV Disha Encounter: గతేడాది నవంబర్ 26న హైదరాబాద్ శివారులో జరిగిన ‘దిశ’ హత్యాచార విషయం తెలిసిందే. నలుగురు అత్యంత క్రూరంగా ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి ఆ తరవాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ తరవాత ఆ నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షలో ‘దిశ ఎన్‌కౌంటర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి కూడా విధితమే. ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

దిశ ఘటన జరిగిన నవంబర్ 26నే సినిమాను విడుదల చేయాలని రామ్ గోపాల్ వర్మ చూస్తున్నాడు. అయితే, ఈ సినిమాపై దిశ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అంతేకాదు, ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలని హైకోర్టుకు వెళ్లారు. అలాగే, హైదరాబాద్‌లోని వర్మ ఆఫీసు ముందు మహిళా సంఘాలతో కలిసి దిశ తండ్రి ఆందోళన చేపట్టారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమాకు వ్యతిరేకంగా దిశ నిందితుల కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనకు దిగారు. ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాలో తమ వారిని విలన్లుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ వర్మ ఆఫీసు ఎదుట దిశ నిందితుల కుటుంబ సభ్యులు బైఠాయించారు. మరి దీనిపై రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి.