యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా చిత్ర బృందం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ హైప్ ఎక్కిస్తున్నారు.
NTR30 మూవీ సెట్స్ మీదకు వెళ్ళడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నప్పటికీ, షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసిన కొరటాల టీమ్.. తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసినట్లుగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు.
పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో #NTR30 సెకండ్ షెడ్యూల్ ని పూర్తి చేసినట్లుగా రత్నవేలు వెల్లడించారు. సోదరుడు తారక్ స్టైల్ అండ్ యాక్షన్ ఇన్ క్రెడిబుల్ అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ‘వస్తున్నా..’ అంటూ డీఓపీ ఇచ్చిన అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఫినిష్ చేసిన షెడ్యూల్ లో సైఫ్ కూడా పాల్గొనగా.. తారక్, సైఫ్ మధ్య కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం.
కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఎన్టీఆర్30 సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. దీని కోసం భారీ ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. సినిమాలో Vfx వర్క్స్ కు అధిక ప్రాధాన్యత ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి, సీజీ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట.
నందమూరి ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై NTR30 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చూసుకుంటున్నారు. హలీవుడ్ కు చెందిన VFX సూపర్ వైజర్ బ్రాడ్ మినించ్, పాపులర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బాట్స్ ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2024 సమ్మర్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు.