పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ లుక్

396
Hari Hara Veera Mallu First Glimpse | Pawan Kalyan | Krish | #HHVM​
Hari Hara Veera Mallu First Glimpse | Pawan Kalyan | Krish | #HHVM​

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న తొలి చిత్రం పేరు ‘హరిహర వీరమల్లు’గా ప్రకటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్.రత్నం మెగా సూర్య  పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తో పాటు హీరో ఫస్ట్ లుక్ తో కూడిన టీజర్ కూడా మహాశివరాత్రి సందర్భంగా జనం ముందు నిలచింది.

 

 

వైవిధ్యమైన చిత్రాలను రూపొందించడంలో ఇప్పటికే భళా అనిపించుకున్న క్రిష్, పవన్ కళ్యాణ్ ను తొలిసారి జానపద చిత్రంలో నటింప చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెటప్ చూడగానే ఆ నాటి జానపద కథానాయకుల గెటప్ గుర్తుకు వస్తుంది. ఈ లుక్ తో పాటు బ్యాక్ డ్రాప్ గా భారీ నౌక కూడా కనిపిస్తోంది. దీనిని చూస్తే 1965 నాటి  ఎమ్జీఆర్ రంగుల జానపదం ‘ఆయిరత్తిల్ ఒరువాన్’ గుర్తుకు రాకమానదు.

 

 

ఇక ఈ సినిమా టైటిల్ కింద ‘ద లెజండరీ హిరాయిక్ ఔట్ లా’ అన్న ట్యాగ్ చూస్తే, తప్పకుండా యన్టీఆర్ ‘బందిపోటు’ తరహా చిత్రాలు కూడా మన తలపుల్లో మెదలుతాయి.  జానపద చిత్రం అనగానే ఎవరికైనా పలు పాత కథలు గుర్తుకు రాకుండా ఉండవు. ‘బాహుబలి’ సినిమా చూశాక కూడా ఎంతోమందికి పాత జానపదాలు మదిలో మెదిలాయి.

 

 

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తొలి జానపద చిత్రం కాబట్టి ‘హరిహర వీరమల్లు’ అభిమానులలో భారీ అంచనాలు పెంచేలాగుంది. అదీగాక, నిర్మాత ఎ.ఎమ్.రత్నంకు పవన్ కళ్యాణ్ అచ్చివచ్చిన కథానాయకుడు. వారి కాంబోలో వచ్చిన ‘ఖుషి’ అప్పట్లో యువతను కిర్రెక్కించింది. మరి ఈ ‘హరిహర వీరమల్లు’ కూడా అభిమానులను విశేషంగా అలరిస్తుందనే అనిపిస్తోంది. 2022 జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనం ముందుకు రానుంది.