కన్నడ సినిమా స్థాయిని పెంచిన KGF సినిమాను ఉద్దేశిస్తూ ఇటీవల టాలీవుడ్ డైరక్టర్ వెంకటేశ్ మహా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ”తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి అంతా సముద్రంలో పడేస్తాడు. అలాంటి నేచ్** ఎవరైనా ఉంటారా? కానీ మనం ఆ సినిమాలకే చప్పట్లు కొడుతున్నాం” అని మహా కామెంట్ చేసాడు. నెట్టింట పెద్ద దుమారం రేపిన ఈ వ్యవహారంపై తాజాగా హీరో నాని స్పందించారు.
‘దసరా’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నేచురల్ స్టార్ నాని.. వెంకటేశ్ మహా ఏదైతే మాట్లాడాడో అది కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. “ఇటీవల డైరెక్టర్స్ కలిసి పాల్గొన్న ప్రోగ్రామ్ ను చూశాను. అందులో 4 డైరెక్టర్స్ నాతో వర్క్ చేసినవాళ్ళు. వెంకటేశ్ మహా ఏం మాట్లాడాడో.. ఆ మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు. దీని గురించి మహా ఇప్పటికే వివరణ ఇచ్చారు”
“నా ఉద్దేశం ప్రకారం చెప్పాలంటే.. ఒక సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చి దాని గురించి మన ఫ్రెండ్స్ తో ఒక టోన్ లో చెబుతాం. ఇంటర్వెల్ లో కొన్ని మాట్లాడతాం. ఆ రోజు చర్చ కూడా థియేటర్ బయట జరిగిన ఒక డిస్కషన్ లాగా వెళ్ళిపోయింది. కొంచం జాగ్రత్తగా చెప్పాల్సింది. దానివల్లే అతడు విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాడు” అని నాని అన్నారు.
“అదే ప్రోగ్రామ్ లో పక్కన ఉన్న మిగతా దర్శకులు నందినీ రెడ్డి, వివేక్, మోహన్ కృష్ణ, శివలు కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వారితో నేను వర్క్ చేశాను. వాళ్లకు మాస్, కమర్షియల్ సినిమాలు అంటే ఎంతో ఇష్టం. నందినీ రెడ్డి మాస్ సినిమాలు చూస్తూ థియేటర్ లో విజిల్స్ వేస్తది. వీళ్ళంతా ఇతర సినిమాలని చూసి ట్వీట్ చేసో, ఏదొక పోస్ట్ పెట్టి అప్రిసియెట్ చేసే బ్యాచ్”
“కాకపోతే తమ పక్కనున్న సహ దర్శకుడు ఫన్నీ టోన్ లో నెరేట్ చేస్తున్నప్పుడు వాళ్లు సహజంగానే అలా నవ్వారు. దాన్ని తప్పుగా భావించి, వాళ్లందర్నీ ఎక్కువగా శిక్షించకూడదు. దీనికి వివరణ ఇస్తూ వాళ్ళు పోస్ట్స్ కూడా పెట్టారు. వాళ్లంతా చాలా మొహమాటస్తులు. వాళ్ళు జెమ్స్. 10 నిమిషాల చిన్న వీడియో క్లిప్ చూసి వాళ్లను జడ్జ్ చేయను. ఎందుకంటే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఏదేమైనా అలాంటి సంఘటన చోటుచేసుకోవడం నిజంగా దురదృష్టకరం. మనందరం KGF ను ఇష్టపడ్డాం.. RRR ను ఇష్టపడ్డాం.. మన ఇండస్ట్రీలో అన్ని రకాల సినిమాలు రూపొందుతాయి” అని నాని చెప్పుకొచ్చారు.
ఇక నాని ‘దసరా’ విషయానికొస్తే.. శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇది నానికి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం.. నానికి ఎలాంటి ఇమేజ్ ను తీసుకొస్తుందో చూడాలి.
Hero Nani Reacts On Venkatesh Maha Comments On KGF Movie.. In recent Dasara movie promotion interview Nani respond on KGF movie Controversy.