Rajinikanth moves Madras HC against property tax demand for marriage hall

Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్‌ మద్రాస్ హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని కొడంబాకంలో రజినీకాంత్‌కు రాఘవేంద్ర కళ్యాణ మండపం ఉంది. దానికి సంబంధించి రూ.6.5లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ నోటీసులు పంపించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని తలైవాను కోర్టు హెచ్చరించింది.

ఈ నోటీసులపై మద్రాస్ హైకోర్టును రజనీకాంత్ ఆశ్రయించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి కళ్యాణమండపం మూసి ఉందని… అప్పటి నుంచి కళ్యాణమండపం ద్వారా తమకు ఎలాంటి ఆదాయం రాలేదని ఆయన కోర్టులో పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ పన్నును చెల్లించలేనని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ ధర్మాసనం రజినీకాంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వానికి పన్ను చెల్లించడం అందరి బాధ్యతని, అలాంటి అంశాలపై కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై రజినీకాంత్ తరపు లాయర్ స్పందిస్తూ పిటిషన్ విత్‌డ్రా చేసుకునేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు.