విశ్వక్ సేన్ హిట్ మూవీ రివ్యూ

2332
Vishwak Sen HIT Telugu Movie Review Rating
Vishwak Sen HIT Telugu Movie Review Rating

విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020
రేటింగ్ : 3/5
నటీనటులు : విశ్వక్ సేన్, రుహని శర్మ, మురళి శర్మ, బ్రహ్మాజీ, తదితరులు…
దర్శకత్వం : డాక్టర్ శైలేష్ కొలను
నిర్మాత‌లు : ప్రశాంతి. టి
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫర్ : ఎస్ మణి కందన్
ఎడిటర్ : గ్యారీ బి హెచ్

విశ్వక్‌ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్‌’. ‘ది ఫస్ట్‌ కేస్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌ . హీరో నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో నాని ప్రొడ్యూసర్‌గా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా? క్రైమ్‌ స్టోరీని దర్శకుడు శైలేష్‌ కొలను తెరపై చక్కగా ప్రజెంట్‌ చేశాడా? విశ్వక్‌ సేన్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేట్‌ ఆఫీసర్‌గా ఏ మేరకు మెప్పించాడు? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) తీవ్రమైన ఒత్తిడితో బాధపడే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. ఒక క్లిష్టమైన కేసును ఛేజ్ చేసిన విశ్వక్ సేన్ కు మిస్టరీ కేసు ఎదురవుతుంది. సిఐ (మురళీ శర్మ) అజాగ్రత్త వల్ల ప్రీతి అనే కిడ్నాప్ అవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేట్ అవుతుండగానే నేహా (రుహాని శర్మ) ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ కు కిడ్నాప్ అవుతుంది. ఈ రెండు కేసులకు ఒక కామన్ లింక్ ఉందని అనుమానిస్తాడు విక్రమ్. అదే సమయంలో అభిలాష్ అనే ఆఫీసర్ ఈ కేసులో విక్రమ్ ను అనుమానిస్తాడు.

ఇక మిగిలిన కథ అంతా ప్రీతి మిస్సింగ్ కు నేహా కిడ్నాప్ కు సంబంధం ఏంటి? అసలు విక్రమ్ కు తీవ్రమైన ఒత్తిడి ఎందుకు వస్తుంటుంది.

నటీనటులు:
విశ్వక్ సేన్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ ఛాయిస్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రప్ఫాడించాడు ఈ కుర్ర నటుడు. సీరియస్ పాత్రలో మెప్పించాడు. ఫలక్‌నుమా దాస్ కంటే కూడా ఇందులోనే బాగా నటించాడు విశ్వక్. రుహానీ శర్మది చిన్న పాత్రే. కానీ ఉన్నంత సేపు బాగానే ఉంది. మరో కీలక పాత్రలో మురళీ శర్మ బాగా నటించాడు. ఆయనతో పాటు భానుచందర్, ప్రీతి అనే అమ్మాయిగా సాహితి బాగున్నారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

విశ్లేషణ:
నాని ప్రొడక్షన్‌ హౌజ్‌ నుంచి విశ్వక్‌ సేన్‌ సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ డిఫరెంట్‌ టైటిల్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని చెప్పగానే అందరూ ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల అంచనాలను, నాని నమ్మకాన్ని, విశ్వక సేన్‌ ఆశలను డైరె​క్టర్‌ శైలేష్‌ కొలను వమ్ము చేయలేదు. ఇలాంటి క్రైమ్‌ స్టోరీలపై సినిమాలు చాలానే వచ్చినా.. ఇన్వెస్టిగేషన్‌ చేసే విధానం కొత్తగా అనిపిస్తుంది. కథ మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టకుండా, బలమైన క్రైమ్‌, ఇన్వెస్టిగేషన్‌ సీన్లపైనే దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే అవే సినిమాకు ప్రధాన బలం అవుతాయి. ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌తో పాటు మధ్యమధ్యలో హీరోహీరోయిన్ల లవ్‌ సీన్స్‌, హీరో గతం గురించి చూపించడం వంటివి డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేకు అద్దంపట్టింది.

సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్‌ కార్డు పడే వరకు కూడా ప్రేక్షకుడు నెక్ట్స్ ఏంటి అని ఆసక్తిగా ఎదురుచూస్తాడు. కొన్ని క్రైమ్‌ సినిమాలలో అసలు దోషి ఎవరో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది అయితే హీరో అతడిని ఎలా పట్టుకుంటాడని ఆసక్తిగా తిలకిస్తారు. కానీ ఈ సినిమాలో హీరోతో పాటు ప్రేక్షకుడు కూడా అసలు ఈ కిడ్నాప్‌ చేసింది ఎవరో అని మదిలో ఇన్వెస్టిగేట్‌ చేయడం ఖాయం. అయితే ప్రీ క్లైమాక్స్‌ వరకు బాగానే ఉన్నా.. క్లైమాక్స్‌తోనే దర్శకుడు కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ క్రైమ్‌ కేసు వెనక బలమైన కారణాన్ని చూపించలేదు. దీంతో సినిమా గ్రాఫ్‌ ఒక్కసారిగ పడిపోయిందన్న భావన కలుగుతుంది. హిట్‌కు సీక్వెల్‌ ఉండటంతో క్లైమాక్స్‌ను సాదాసీదాగా ముగించవచ్చని సగటు అభిమానికి సందేహం కలగక మానదు.

రెగ్యులర్ సినిమాల మాదిరి పంచ్ డైలాగులు.. కామెడీ.. పాటలు అలాంటివేం కనిపించవు. మొత్తంగా సీరియస్ కాప్ డ్రామా ఇది. దాంతో ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను బాగా ఇష్టపడే అవకాశాలున్నాయి. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మరింత రేసీగా ఉంది. కానీ సినిమా అంతా ఒకే కేసుపై వెళ్లడంతో అక్కడక్కడా ల్యాగ్ చేసినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే పాయింట్ చిన్నదే అయినా కూడా స్క్రీన్ ప్లేతో హిట్ నడిపించాడు దర్శకుడు శేలేష్. అక్కడక్కడా దిశ కేసును కూడా తన సినిమాలో వాడుకున్నట్లు అనిపించింది. మరీ ముఖ్యంగా ఓఆర్ఆర్ ఎపిసోడ్.. అక్కడ అమ్మాయి మిస్ కావడం.. పదేపదే టోల్ గేట్స్ చూపించడం అవన్నీ చూస్తుంటే సంచలనం రేపిన దిశ కేసు గుర్తుకొస్తుంది. ఇక సినిమాలో విశ్వక్ సేన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో చాలా సార్లు చూపించినా కూడా చివర్లో సెకండ్ పార్ట్‌లో చూడండి అన్నట్లు వదిలేసాడు దర్శకుడు. ఇలాంటి జానర్‌ సినిమాలను ఇష్టపడే వారు ‘హిట్‌’ కథలో తప్పకండా ఇన్వాల్స్‌ అయి ఆసక్తిగా చూస్తారు. థ్రిల్‌గా ఫీలవుతారు.

సాంకేతిక నిపుణులు:
శైలేష్ కొలను అందించిన కథలో మంచి పాయింట్ ఉంది. అయితే ఆ కథకు ఇంప్రెసివ్ ఎమోషనల్ యాంగిల్ ఇవ్వడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేదు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంప్రెసివ్ గా ఉండగా, సెకండ్ హాఫ్ లో మధ్యలో కొంచెం డల్ అయినా కానీ మళ్ళీ తిరిగి పుంజుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉండేలా ప్లాన్ చేయడం విశేషం. దర్శకత్వం పరంగా కూడా శైలేష్ కు మంచి మార్కులే పడతాయి.

మణికందన్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ముఖ్యంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అవసరమైన విజువల్స్ ను అందించడంలో విజయవంతమయ్యాడు. వివేక్ సాగర్ కూడా చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మెప్పించాడు. ఎడిటింగ్ స్మూత్ గా ఉంది. థ్రిల్లర్ కు కావాల్సిన రేసీ స్పీడ్ చిత్రానికి ఉండేలా ఎడిటింగ్ ఉంది.

బాటమ్ లైన్.. సూపర్ HIT కొట్టేశారు..

REVIEW OVERVIEW
Chitrambhalare
Previous articleమహేష్‌తో విభేదాలపై ప్రకాష్ రాజ్
Next article‘హిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్..!