ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ‘బాహుబలి-2’ను దాటేసిన ‘జాతిరత్నాలు’!

556
Jathi Ratnalu Movie Beats Baahubali-2 movie
Jathi Ratnalu Movie Beats Baahubali-2 movie

తెలుగు సినిమా ప్రేక్షకులకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే ఓ క్రేజ్. శుక్రవారం వచ్చే కొత్త సినిమాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఏ థియేటర్లో విడుదల అవుతాయో తెలుసుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం. తమ అభిమాన హీరో సినిమా ఈ సెంటర్ లోని ఏ థియేటర్ లో ఎన్ని లక్షల గ్రాస్ వసూలు చేసిందో అభిమానులు తడుముకోకుండా చెబుతుంటారు. ఇక్కడ ఏ హీరో సినిమా, ఏ థియేటర్ లో వంద రోజులు ఆడిందో కూడా వాళ్ళకు తెలుసు.

 

అలాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కళ ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్ల కారణంగా కొంత తగ్గిన మాట వాస్తవమే అయినా… ఇప్పటికీ ఆ సెంటర్ లో సినిమా చూసే వాళ్ళు బాగానే ఉన్నారు. మరీ ముఖ్యంగా మాస్ మూవీస్ ను మల్టీప్లెక్స్ లో కాదు… క్రాస్ రోడ్స్ లోని సింగిల్ థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేయగలమనేది చాలామంది నమ్మకం. అందుకే అక్కడ ఇప్పటికీ థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డ్ పడుతూనే ఉంది.

 

ఇక ‘జాతిరత్నాలు’ లాంటి సినిమాను ఇక్కడ కాకపోతే ఎక్కడ చూడాలని జనం కోరుకుంటారు! అదే జరిగింది!! క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్ లో తొలి వారం ఈ మూవీ ఏకంగా రూ. 38, 63, 652 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసి… క్రాస్ రోడ్స్ లో హయ్యెస్ట్ సింగిల్ థియేటర్ల జాబితాలో ఈ సినిమా మూడో స్థానంలో నిలిచింది. గతంలో ఈ ప్లేస్ లో ఉన్న ‘బాహుబలి-2’ నాలుగో స్థానంలోకి వెళ్ళిపోయింది.

 

‘జాతిరత్నాలు’కు పైన రెండో స్థానంలో రూ. 40,76,058 లక్షలతో ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండగా, ప్రధమస్థానంలో రూ. 40,83,942 లక్షలతో ‘అల వైకుంఠపురములో’ ఉంది. మొత్తం మీద మన ‘జాతిరత్నాలు’ నవీన్, రాహుల్, ప్రియదర్శి కామెడీతో భలే కబడ్డీ ఆడేస్తున్నారు.