Jr NTR and Thalapathy Vijay's fans battle it out on social media for THIS reason
Jr NTR and Thalapathy Vijay's fans battle it out on social media for THIS reason

అభిమానం ఉండాలి కానీ.. దానికి వెర్రి తనం తోడవ్వకూడదు. అలా తోడైతే చిల్లర కొట్లాటలు మాత్రమే ఉంటాయి. తమ హీరోను వేరే హీరోతో కంపేర్ చేయడాలు.. తిట్టుకోడాలు సోషల్ మీడియాలో విపరీతమవుతున్నాయి. హీరోలు.. హీరోలు.. బాగానే ఉంటారు.. కానీ అభిమానులే ఒకరి మొఖం ఒకరు చూసుకోడానికి చాలా నామోషీ పడుతూ ఉంటారు. ముఖ్యంగా తమిళనాడులో ఇలాంటి ఫ్యాన్ వార్స్ చూస్తూ ఉంటాం. విజయ్-అజిత్ ఫ్యాన్స్ మధ్య గొడవలు అంతా.. ఇంతా కాదనుకోండి. కొట్టుకోవడాలు, గ్యాంగ్ వార్స్.. అబ్బో మినీ యుద్ధమే జరుగుతూ ఉంటుంది వారి మధ్యన..!

ఒకప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్-మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హీరోలు సర్ది చెప్పే దాకా వెళ్ళింది. ఇప్పుడు కొందరు ఏ మాత్రం పనీ పాటా లేని వ్యక్తులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాగా డ్యాన్స్ చేస్తాడా.. లేక ఇళయదళపతి విజయ్ బాగా డ్యాన్స్ చేస్తాడా అని తిట్టుకోవడం మొదలుపెట్టారు.

కొందరేమో విజయ్ డ్యాన్స్ అద్భుతంగా చేస్తారు అని అంటే.. ఎన్టీఆర్ అభిమానులు ఊరికే ఉంటారా చెప్పండి..! తమ హీరోకు సంబంధించిన డ్యాన్స్ క్లిప్పింగ్ లు షేర్ చేశారు. విజయ్ ఫ్యాన్స్ కూడా ఆయన అద్భుతంగా చేసిన డ్యాన్స్ వీడియోలను పోస్టు చేస్తూ వచ్చారు. ఇక అక్కడితో ఆగకుండా పర్సనల్ గా దూషించుకునే దగ్గర వరకూ వెళ్ళింది. ఈ రచ్చ మొదలై దాదాపు నాలుగు రోజులు అయింది. ఇద్దరూ మంచి డ్యాన్సర్లే.. ఎందుకు ఈ గొడవ అని సర్ది చెప్పాలని మరికొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. పనీ పాటా లేని వాళ్ళే ఇలా అభిమానుల మధ్య గొడవలు పెడుతూ ఉన్నారని ఇంకొందరు తిడుతూ ఉన్నారు. అయినా కాలం మారుతూ వస్తున్నా ఈ ఫ్యాన్ వార్స్ మాత్రం ఇంకా మారేలా లేవు.. మార్పు టెక్నాలజీ లోనే కాదు.. అభిమానుల్లో కూడా రావాలి.