Judge seeks contempt action against actor Suriya for remarks on judiciary

Actor Surya: ప్రజలంతా నీట్ పరీక్షను వ్యతిరేకించాలని సూర్య విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత #SURIYAagainstNEET హ్యాష్‌టాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఆయనకు చాలా మంది సినీనటులు, నెటిజన్లు మద్దతు తెలిపారు. నీట్ పరీక్షపై స్పందించిన నటుడు సూర్య న్యాయపరమైన ఇబ్బందుల్లో పడనున్నారు.

తమిళనాట నీట్ పరీక్షపై దుమారం రేగుతోంది. కరోనా సమయంలోనూ నీట్ పరీక్షకు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టుతూ హీరో సూర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దేశంలోని న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను విమర్శించిన సూర్యపై కోర్టు ధిక్కార చర్యల తీసుకోవాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.ఎం.సుబ్రమణ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే సూర్యపై ధిక్కార చర్య దిశగా అడుగులు పడటం సంచలనంగా మారింది.

విద్యార్థుల మరణ వార్త విని గుండె పగిలిందని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు సూర్య. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన సమయంలో ఓదార్పు చెప్పాల్సి రావడం సిగ్గుచేటని అన్నారు. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్ ద్వారా న్యాయం చేస్తున్న గౌరవనీయ న్యాయమూర్తులు.. విద్యార్థులను మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరమంటూ విమర్శలు గుప్పించారు సూర్య.

ఇలాంటి పరీక్షలను ‘మనునీతి పరీక్షలు’లుగా అభివర్ణించిన సూర్య వీటివల్ల విద్యార్థుల జీవితాలను బలి తీసుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. అంతేకాదు ఈ ఆత్మహత్యలు తల్లిదండ్రులకు జీవితకాల శిక్షగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కోర్టులు క్రూరంగా వ్యవహరిస్తున్నాయంటూ ట్విటర్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో సూర్యను పలువురు ప్రశంసించడంతోపాటు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.