Kangana Ranaut To Be Provided Y Category Security

Kangana Ranaut : ఇటీవల కంగనా రనౌత్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో ముంబైని పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై శివసేన నేతలు మండి పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం కంగనాకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో కంగనా బోల్డ్ కామెంట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant singh rajput) ఆత్మహత్య కేసు విషయంలో ఆమె స్వరం పెంచారు. బాలీవుడ్‌లోని నెపోటిజమే (Bollywood nepotism) కారణమని వెల్లడించారు. దీంతోపాటు డ్రగ్‌ కేసులో స్టార్స్ అందరిని టెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.

సుశాంత్ కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించట్లేదని, ప్రభుత్వం కొందరిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కంగనా రనౌత్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో ముంబైని పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై అధికార శివసేన నేతలు మండి పడుతున్నారు. దీంతో శివసేన నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. మహారాష్ట్ర, ముంబయి, మరాఠాల గురించి మితిమీరి మాట్లాడితే సహించేది లేదని, తాను చేసిన వ్యాఖ్యలపై కంగనా క్షమాపణలు చెప్పాలని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ డిమాండ్‌ చేశారు. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెకి వై ప్లస్‌ కేటగిరి భద్రతని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించినట్టు ప్రెస్‌ ట్రస్ట్ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

కంగనా రనౌత్.. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన ‘ఏక్ నిరంజన్‌’ సినిమాలో ‘సమీర’గా ఇరగదీసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ టాక్‌ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. అంతేకాదు మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది.