Keerthy Suresh bats for women entrepreneurs in her new film

Keerthy Suresh Miss India Trailer: నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ”మిస్ ఇండియా”. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించారు. క‌థ‌లు ఎంపిక‌ చేసుకోవడంలో ఆచితూచి అడుగులేస్తున్న ఆమె ‘మిస్ ఇండియా’గా అలరించేందుకు రెడీ అయింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రీలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్.

ఏప్రిల్ 17న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదాపడి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ‘మిస్ ఇండియా’ సినిమాని విడుదల చేయనున్నారు. కీర్తి రోల్ చూస్తుంటే ఈ సినిమాతో ఆమె ఖాతాలో మరో సాలీడ్ హిట్ పడ్డట్లే అనిపిస్తోంది. గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలనే సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి విదేశాల్లో వ్యాపారం చేసి ఎలా గెలిచిందనే ప్రేరణాత్మక కథాంశంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టమవుతోంది.

దీనికి తోడు ఈ ట్రైలర్‌లో ఆలోచింపదగ్గ డైలాగులు సీనియర్ నటుడు జగపతి బాబు కు కీర్తికి నడుమ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. ‘మిస్ ఇండియా’ కి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మిగితా ముఖ్య పాత్రల్లో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ, నదియా నటిస్తున్నారు. మరో వైపు కీర్తి ఓ స్పోర్స్ డ్రామాలో కూడా నటిస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ తెలుగులో నితిన్‌తో రంగ్‌దే అనే సినిమా చేస్తోంది.