Kollywood Director Mohan Raja Name For chiranjeevi Lucifer Remake

Lucifer Remake: మెగాస్టార్ చిరంజీవి తర్వాతి సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలని చిరంజీవి భావిస్తు్న్నారు.

ఇప్పటికే యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తాడని వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ కూడా పూర్తయిన తర్వాత సుజీత్ తప్పుకున్నాడట. ఆ తర్వాత చిరంజీవితో మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్న వినాయక్ పేరు తెరపైకి వచ్చింది. అదికూడా కాదని ఆ తర్వాత రీమేక్ సినిమాలకు కమర్షియల్ హంగులు అద్దడంలో ట్యాలెంట్ ఉన్న హరీష్ శంకర్ ఈ సినిమా చేస్తున్నారని టాక్ వచ్చింది.

అయితే తాను ఆ సినిమా చేయడం లేదని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ జాబితాలోకి మరో డైరెక్టర్ పేరు వచ్చి చేరింది. అయితే ఆయన తెలుగు దర్శకుడు కాదు. రామ్‌చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ధ్రువ’ సినిమా గుర్తింది కదా.. ఆ సినిమా మాతృక అయిన ‘తని ఒరువన్’ను డైరెక్టర్ చేసిన మోహన్ రాజా. కొన్ని రోజులుగా మోహన్ రాజా దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఆయన లూసిఫర్ స్క్రిప్ట్ వర్క్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్నారని, ఆయన డైరెక్ట్ చేయబోయేది చిరంజీవిని అని టాక్.

చిరంజీవి చెప్పినట్లుగా ఆయన స్ర్కిప్ట్ కూడా మార్చి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందో చిరునే చెప్పాలి. లూసిఫర్ రీమేక్ విషయం ఆయనే చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కిన షూటింగ్ శరవేగంగా దూసుకుపోతుంది.