Lava Kusa actor Anaparthi Nagaraju passed away

Anaparthi Nagaraju: ‘లవకుశ’ సినిమాలో లవుడు పాత్ర పోషించిన నాగరాజు (Lava Kusa Nagaraju) కన్నుమూశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) రాముడిగా, అంజలి దేవి సీతగా నటించిన ‘లవకుశ’ చిత్రం గురించి తెలియని తెలుగువారు ఉండరు. 1963లో విడుదలై ఆ చిత్రంలో లవ, కుశులుగా అనపర్తి నాగరాజు, ఉయ్యూరి సుబ్రహ్మణ్యం నటించారు.

అయితే, లవుడి పాత్రలో తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించిన నాగరాజు సెప్టెంబర్ 7 ఉదయం కన్నుమూశారు. ఈయన వయసు 71 సంవత్సరాలు. గుండెపోటుతో హైదరాబాద్‌‌లోని గాంధీ నగర్‌లో తన స్వగృహంలోనే ఈయన మరణించారు. 13 ఏళ్ల వయసులో తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు నాగరాజు. ఆ వయసులోనే లవకుశలో కుశుడిగా నటించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. లవకుశ చిత్రం ద్వారా బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన నాగరాజు.. ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో 340కు పైగా చిత్రాల్లో నటించారు.

నాగరాజు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు డి.సురేష్ కుమార్, సభ్యులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.