ఆ నటుడి వ్యాఖ్యలపై `మా` అధ్యక్షుడు ఫైర్

0
471

కన్నడ పరిశ్రమలోని ఓ అగ్రనటుడిపై తెలుగులో ఓ చోటా నటుడు అవాకులూ చవాకులూ పేలడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అతని వ్యాఖ్యాలకు కన్నడ హీరోలంతా ఆగ్రహోదగ్రులయ్యారు. కన్నడ లెజెండరీ కథానాయకుడు విష్ణువర్ధన్ పై తెలుగు నటుడు విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు నటుడు నరేష్ తీవ్రంగా ఖండించారు. పైగా విష్ణువర్దన్ జీవించి లేరు కూడా. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం కన్నడ నటుల ఆగ్రహానికి కారణమైంది.

దీనిపై కన్నడ హీరోలు పునీత్ రాజ్ కుమార్, సుధీప్, యశ్, ఉపేంద్ర, నటి సుమలత స్పందించారు. కర్ణాటకలోని విష్ణువర్ధన్ అభిమానులు కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అలాగే కన్నడిగుల ఆరాధ్య దైవాన్ని మన నటుడు రంగరాజు అవమానించారు. అనకూడని మాటలన్నారు. ఏకవచనంతో తూలనాడారు. నటుడిగా నన్ను ఇది ఎంతో బాధించిందని నరేష్ అన్నారు. కోట్లాది ప్రజల అభిమానం పొందిన ఓ కళాకారుడి గురించి అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలా జరిగినందుకు బాధపడుతున్నా. ఇవి విజయ రంగరాజు వ్యక్తిగత ఆలోచనలు అయినా మాట్లాడిన తీరు చాలా తప్పు అని అన్నారు. చిన్న తనం నుంచి విష్ణువర్దన్ ని చూస్తూ పెరిగామని నరేష్ వెల్లడించారు.

విష్ణు వర్ధన్ సాటి నాయికలతో సరిగా ప్రవర్తించేవారు కాదన్న రంగరాజు వ్యాఖ్యలకు కన్నడిగుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తవిజయ్ రంగరాజు పై చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ అల్లుడు అనిరుద్ధ జట్కర్ తెలుగు సినీ ప్రముఖుల్ని కోరారు. అక్కడితో ఆగలేదు కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా కేసు నమోదైంది. తన వ్యాఖ్యలపై ఇంతలా దుమారం రేగుతుందని విజయ్ రంగరాజు ఊహించలేదు. ఆయన కన్నీటి పర్యంతమవుతున్నారు. తనను క్షమించమని కోరుతున్నారు. దీనిపై ఆయన కూడా వీడియో విడుదల చేశారు. కాళ్లు పట్టుకుంటా వదిలేయండి అంటూ ఆయన వేడుకుంటున్నారు..