Maharashtra Government order to interact kangana ranaut in drugs scandal

Kangana Ranaut Drug Case: బాలీవుడ్ క్వీన్ కంనగా రనౌత్, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీతో గత కొన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కేసులో (drugs scandal) కంగనాను (Kangana) విచారించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం చోటుచేసుకున్న అనేక పరిణామాల్లో అధికార శివసేన పార్టీతో కంగనా రనౌత్ పోరాటం ముఖ్యమైనది. సాక్షాత్తు సీఎం ఉద్ధవ్ థాకరేతో ఢీ అంటే ఢీ అంటూ కంగనా చేస్తున్న వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. ఆ తర్వాత కంగనా ఆఫీసు నిబంధనలకు విరుద్ధంగా ఉదంటూ బృహన్ ముంబై కార్పొరేషన్ అందులో కొంత భాగాన్ని కూల్చేసింది. ఇది పెను దుమారానికి దారితీసింది. సీఎం ఠాక్రే మీద రనౌత్ విమర్శల దాడి పెంచారు. అప్పుడు అయోధ్య రామమందిరాన్ని కూల్చడానికి బాబర్ వస్తే ఇప్పుడు తన ఆఫీసును కూల్చడానికి ఠాక్రే వచ్చారంటూ కామెంట్స్ చేశారు. అలాగే, తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశిస్తూ ఘాటు ట్వీట్ చేశారు. ముంబైలో జరుగుతున్న దానిపై స్పందించకపోతే చరిత్ర మొత్తం చూస్తోందని అన్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా మహారాష్ట్ర సర్కారు కంగనాపై డ్రగ్స్ కేసులో విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.

గతంలో అధ్యయన్ సుమన్ అనే నటుడు కంగనాపై డ్రగ్స్ ఆరోపణలు చేశాడు. కంగనా తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తనను మాదకద్రవ్యాలు తీసుకోవాల్సిందిగా ప్రోత్సహించిందని ఆరోపించాడు. అసలే కంగనా అంటే మండిపడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం అధ్యయన్ సుమన్ వ్యాఖ్యల ఆధారంగా కంగనాను విచారించాలని భావిస్తోంది. ఆమెపై దర్యాప్తు ప్రారంభమైందని ముంబయి పోలీసులు కూడా ప్రకటించారు.