రజినీ రాజకీయ ప్రవేశంపై చిరు మహేష్ కామెంట్స్..!

391
Mahesh Babu Chiranjeevi Comments On Rajinikanth Political Journey

సూపర్‌స్టార్ రజినీకాంత్ నేడు తన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1950 సంవత్సరం డిసెంబర్ 12న మహారాష్ట్రలో జన్మించిన ఆయన.. ప్రతియేడాది పుట్టినరోజు వేరు.. ఈ ఏడాది పుట్టినరోజు వేరు. ఈసారి రజినీ అభిమానులకు ఈ పుట్టినరోజు మరింత ప్రత్యేకమైనది. ఇక సినీ ఇండస్ట్రీలో పెద్దా, చిన్నా అనే తేడా చూపకుండా ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉండటం ఆయన మ్యానరిజం. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ 70వ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఆయన రాజకీయారంగేట్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు 2020 డిసెంబర్ 31 న ముహూర్తం ఖరారైంది. రజినీ నుండి రాజకీయ పార్టీ ప్రకటన వెలువడనుంది. ఈ క్రమంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రజనీకి చిరంజీవి స్పెషల్ విషెస్ చెప్పారు. ”ప్రాణ స్నేహితుడు రజనీకాంత్‌కి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నా. మీ జీవితం మరింత గొప్పగా మారాలని, రాజకీయాల్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా. సినిమాల్లో మీకే సొంతమైన ప్రత్యేక స్టైల్‌తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కూడా ప్రత్యేకమైన కోణంలో ప్రజలందరికీ సేవ చేస్తారని నమ్ముతున్నా. ఆ దేవుడి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి” అని పేర్కొన్నారు చిరంజీవి.

కొన్నేళ్ల క్రితం తాను రజనీకాంత్ ఒకేసారి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నామని ఓ ప్రయివేట్ కార్యక్రమంలో తెలిపారు. కానీ తెలియని కారణాల వల్ల రజిని అప్పుడు వెనక్కి తగ్గారు. సూపర్ స్టార్ మహేష్ కూడా రజనీకి విషెస్ తెలిపారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు రజనీకాంత్ సర్! మీరు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ.. సినిమాలో శైలిని పునర్నిర్వచించడాన్ని కొనసాగించండి. మీకు మంచి ఆరోగ్యం.. ఆనందం .. శాంతి ఉండాలని కోరుకుంటున్నాను! ”అని మహేష్ ట్విట్టర్ లో కోరారు.

రజినీ సక్సెస్ కోరుకుంటూ మెగాస్టార్ సూపర్ స్టార్ చేసిన ఈ ట్వీట్ చూసి లక్షలాది మంది ఫ్యాన్స్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు తలైవా పార్టీ పేరు, చిహ్నం, జెండా తదితర విషయాలపై వార్తలు ఊపందుకున్నాయి.