మరోసారి అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్న మహేష్ బాబు

148
Mahesh Babu Doing Next Movie with Anil Ravipudi
Mahesh Babu Doing Next Movie with Anil Ravipudi

సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమాను విడుదల చేసి ఏడాది అవుతుంది. ఆ గ్యాప్‌ను కవర్ చేయాలని మహేష్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. వరుస సినిమాలను ఓకే చేస్తూ మహేష్ దూకుడు కనబరుస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది.

 

 

ఈసినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ తన సినిమాను రాజమౌళితో చేయనున్నారంట. వీరి కాంబోలో ఓ సినిమా రానుందని ఇది వరకే అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా వీరి కాంబోలో రానున్న సినిమా కోసం ఆఫ్రికా అడవుల్లో ప్రదేశాలను వెతుకుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు.

 

 

కాబట్టి మహేష్, రాజమౌళి సినిమా మొదలు కావాలంటే వచ్చే ఏడాది సమ్మర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకనే మహేష్ ఈ గ్యాప్‌లో మరో సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యారంట. అందులో భాగంగా కొందరు తమిళ దర్శకులతో కూడా సంప్రదింపులు జరిపారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా మహేష్ తన తాజా సినిమాను మళ్లీ అనిల్ రావిపూడితో చేసేందుకు మొగ్గు చూపుతున్నారంట.

 

 

ఈ మేరకు అనిల్ తన నూతన కథను మహేష్‌కు వినిపించారని ఆ కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తాజాగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాను కుదిరినంత త్వరగా పూర్తి చేయాలని కూడా మహేష్ ప్రయత్నిస్తున్నారంట. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.