ఇండియాలో ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో సినిమాలు నిర్మాణం అవుతున్న విషయం తెల్సిందే. ప్రతి ఏడాది కూడా కొన్ని సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అవ్వడం ఆ తర్వాత ఉసూరుమనిపించడం జరుగుతుంది. ఈసారి మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఆస్కార్ రేసులో నిలిచింది. 93వ అకాడమీ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైంది. ఆస్కార్ ఎంట్రీ కోసం భారత్ నుంచి మొత్తం 27 సినిమాలు పోటీపడగా వాటిలో ‘జల్లికట్టు’ రేసులో నిలిచింది.
లిజో జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక దున్నపోతు ను వేటాడే క్రమంలో గ్రామంలో ఏం జరిగింది అనేది చూపించారు. ఆస్కార్స్ 2021 కోసం బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో భారత్ నుంచి మొత్తం 27 సినిమాలు ‘ది డిసిపిల్’, ‘శకుంతలా దేవి’, ‘శిఖర’, ‘గుంజన్ సక్సేనా’, ‘ఛపాక్’, ‘ఏకే వర్సస్ ఏకే’, ‘గులాబో సితాబో’, ‘భోంస్లే’, ‘ఛలాంగ్’, ‘ఈబ్ అల్లేయ్ ఊ!’, ‘చెక్ పోస్ట్’, ‘అట్కన్ చట్కన్’, ‘సీరియస్ మెన్’, ‘బుల్బుల్’, ‘కామ్యాబ్’, ‘ది స్కై ఈజ్ పింక్’, ‘చింటు కా బర్త్‌డే’, ‘బిట్టర్‌స్వీట్’ తదితర చిత్రాలు పోటీపడ్డాయి.
అయితే, ఈ 27 సినిమాల్లో ‘జల్లికట్టు’నే ఆస్కార్‌కు ఎంపిక చేయడానికి గల కారణాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు చైర్మన్ రాహుల్ రవియల్ వెల్లడించారు. సినిమా థీమ్, ప్రొడక్షన్ క్వాలిటీ, లిజో జోసే పెల్లిస్సెరీ దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయని రాహుల్ ప్రశంసించారు. ఈ సినిమాను జల్లికట్టు అనే టైటిల్ తో ఆహాలో డబ్బింగ్ చేశారు. తెలుగు ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.