Priyadarshi, Mallesham Telugu Movie Review, Rating, Telugu Cinema Reviews
Priyadarshi, Mallesham Telugu Movie Review, Rating, Telugu Cinema Reviews

విడుదల తేదీ : జూన్ 20, 2019
రేటింగ్ : 3/5
టైటిల్‌ : మల్లేశం
జానర్‌ : బయోపిక్‌
నటీనటులు : అనన్య, ఝాన్సీ, చక్రపాణి తదితరులు
సంగీతం : మార్క్‌ కె.రాబిన్‌
దర్శకత్వం : రాజ్‌ ఆర్‌
నిర్మాత : రాజ్‌ ఆర్, శ్రీ అధికారి

అప్పుడప్పుడు చడీచప్పులేకుండా తెరకెక్కిన సినిమాలు,ఫిల్మింగ్ దశలో ఎలాంటి అంచనాలు లేని సినిమాలు కూడా సరయిన కంటెంట్,కనెక్ట్ అయ్యే అంశాలతో వస్తే మాత్రం ఓవర్ నైట్ లో అవి అందరిచేత జేజేలు కొట్టించుకుంటాయి.అలా ట్రైలర్ తోనే మంచి అంచనాలు రేకెత్తించి,మంచి సినిమ అనిపంచుకుంది మల్లేశం.ట్రైలర్ తో ఒక స్ఫూర్తిదాయకమయినా సినిమా చూడబోతున్నాం అనే హింట్స్ ఇచ్చింది.మరి ట్రైలర్ చేసిన ఆ ప్రామిస్ ని సినిమా నిలబెట్టుకుందా?,మల్లేశం కథ మనసులకు హత్తుకుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

ఆలేరు అనే ఊళ్ళో చేనేత తో జీవితాలు సాగించే దంపతులకు పుట్టిన మల్లేశం తన కుటుంబ ఆర్ధిక పరిస్థితి వల్ల ఆరోతరగతిలోనే చదువు ఆపెయ్యాల్సి వస్తుంది.తండ్రితో కలిసి చీరలు నేస్తూ జీవితం గడుపుతుంటాడు.అయితే మల్లేశం తల్లి ఏళ్ళ తరబడి ఆశు పోస్తూ ఉండడంతో ఆమె ఎముకలు అరిగిపోయి చెయ్యి పడిపోయే స్థితి వస్తుంది.ఆమెకే కాదు ఆ ఊళ్ళో చేనేత నేసే ఇళ్లలో చాలామంది ఆడవాళ్లకు అదే ఇబ్బంది తలెత్తుతుండంతో ఆరోతరగతిలో చదువు ఆపేసిన మల్లేశం ఆశు యంత్రం తయారుచెయ్యడం మొదలుపెడతాడు.చదువు లేదు,డబ్బు లేదు,కటిక పేదరికం…అలాంటి దారుణమయిన పరిస్థితుల్లో ఉన్న మల్లేశం ఆశు యంత్రాన్ని కనిపెట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు,చివరికి తాను అనుకున్న ఆ ఆశు యంత్రాన్ని ఎలా కనిపెట్టాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు:

ఇప్పటివరకు కేవలం కమెడియన్ గా ఉన్న ప్రియదర్శి తనలోని నటుడు నవ్వించడమే కాదు భావోద్వేగాలను పండించి ఏడిపించగలడు కూడా అని నిరూపించుకున్నాడు.అతని నటనలో మెచ్యూరిటీ చూసి విస్తుపోతారు.మల్లేశం పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి,చాలా నేచురల్ గా నటించి ఆకట్టుకున్నాడు.మల్లేశం తల్లిగా నటించిన ఝాన్సీ నటనని మెచ్చుకుని తీరాలి.క్యారెక్టర్ లో కంటెంట్ ఉంటే దాన్ని ఆమె ఏ రేంజ్ లో ప్రెజెంట్ చెయ్యగలదు అనే విషయం ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది.హీరోయిన్ గా నటించిన తెలుగమ్మాయి అనన్య కూడా తనకి దక్కిన పాత్రకి పూర్తిన్యాయం చేసింది.ఈ సినిమాలో మిగిలిన వాళ్ళంతా ప్రేక్షకులకు పరిచయం లేని కొత్తవాళ్ళు.అయినా చాలా సహజంగా నటించి ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్:

ఈ సినిమా డైరెక్టర్,అలాగే సినిమా నిర్మాతల్లో ఒకరయిన R రాజ్ చేసిన ప్రయత్నాని మెచ్చుకోవాలి.అసలు ఇలాంటి బయోపిక్ ని ఎంచుకోవడమే చాలా రిస్క్ అనుకుంటే దాన్ని ఎలాంటి కమర్షియల్ అంశాల జోలికి పోకుండా,ఉన్నది ఉన్నట్టుగా,ఎక్కడా డైవర్ట్ కాకుండా తీసాడు.తెలంగాణ నేటివిటీని,తెలంగాణ కల్చర్ ని,చేనేత కార్మికుల వెతలను ఇంతబాగా ఎలివేట్ చేసిన మొదటి సినిమా ఇదే.అయితే సినిమా సెకండ్ హాఫ్ మీద డైరెక్టర్ కాస్త దృష్టిపెట్టాల్సింది.లిమిటేషన్స్ ఉన్నప్పుడు దాన్ని దాటడానికి ఏదైనా లిబరిటీ తీసుకుని ఉండాల్సింది.క్లయిమాక్స్ కూడా మరీ కనెక్టింగ్ గా అనిపించలేదు.ఇక మార్క్.కే.రాబిన్ సంగీతం సినిమాకి ఎస్సెట్.తెలంగాణ కల్చర్ ని,సంప్రదాయాలను కూడా మ్యూజిక్ తో చెప్పడానికి చాలా హార్డ్ వర్క్ చేసాడు.బాలు సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యింది.తెలంగాణ పల్లె అందాలని అతని కెమెరాలో బంధించిన విధానం బావుంది.ఎడిటింగ్ పరవాలేదు.నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.సినిమాకి ఏమి అవసరమో అవి సమకూర్చుకుని సినిమా తీశారు.

ఫైనల్ గా:

ఒక ఇన్స్పిరేషనల్ బయోపిక్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన మల్లేశం ఒక మంచి నిజాయితీగల సినిమా చుసిన అనుభూతి ఇస్తుంది.కానీ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే పాయింట్ చుట్టూ తిరగడం,కమర్షియల్ మీటర్ ని పట్టించుకోకపోవడం అనే అంశాలు ప్రభావం చూపించొచ్చు.బాక్స్ ఆఫీస్ దగ్గర ఫలితం ఎలా ఉన్నా ఒక మంచి సినిమా అనే పేరు తెచ్చుకోవడం గ్యారంటీ.