నటి మనోరమ కుమారుడు ఇలాంటి పని చేశాడేంటి..!

352

దక్షిణాది సినీ నటి దివంగత మనోరమ కుమారుడు భూపతి ఆసుపత్రి పాలవ్వడం చెన్నైలో కలకలం రేపుతోంది. ఆయన స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ కారణంగా ఆసుపత్రిలో చేరాడు. ఆయన ఇలా చేయడానికి ముఖ్య కారణం మద్యం దొరక్కపోవడమే..!

చెన్నై లోని నీలకంఠ మెహతా స్ట్రీట్ లో కుటుంబ సభ్యులతో కలసి నివసిస్తున్న భూపతికి నిత్యమూ మద్యం తాగే అలవాటుంది. లాక్‌ డౌన్‌ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మద్యం కూడా దొరకడం లేదు. ఇలాంటి సమయంలో భూపతి నిద్రమాత్రలు ఎక్కువగా మింగాడు. భూపతి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబీకులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

దీంతో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ భూపతి కుమారుడు రాజరాజన్‌, తన తండ్రికి నిత్యం మద్యం తాగే అలవాటుందని.. అవి దొరక్కపోవడంతో నిద్ర మాత్రలు వేసుకున్నారని అన్నారు. అవి కాస్తా ఓవర్ డోస్ అయ్యాయని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మద్యం దొరకక మందుబాబులు అల్లాడి పోతున్నారు. బ్లాక్ లో కూడా దాదాపు స్టాక్ అయిపోవస్తోంది. ఇకనైనా మద్యం దుకాణాలు తెరవాలని.. కేవలం కొన్ని గంటలైనా తెరవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో అయితే ప్రభుత్వమే డోర్ డెలివరీ మొదలుపెట్టింది. మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.