‘లవ్‌స్టోరీ’కి బై బై.. నాగచైతన్య ‘థాంక్యూ’ షురూ..!

0
408
Naga Chaitanya Thank You Movie Shooting Will Start from December

అక్కినేని వారసుడు నాగచైతన్య దూకుడు పెంచారు. వరుస సినిమాలను లైన్లో పెడుతూ మిగతా హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవితో కలిసి ఆయన నటించిన ‘లవ్‌ స్టోరీ’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి చేస్తూ మరో చిత్రానికి ఆయన పచ్చజెండా ఊపేశారు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న ‘థ్యాంక్యూ’ సినిమా అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అయ్యింది.కారణం ఏంటో కాని ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమాను ఎట్టకేలకు మొదలు పెట్టేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.

ఇందులో కథ రీత్యా ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు. ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేయగా.. మిగిలిన ఇద్దరి కోసం యూనిట్ కసరత్తులు చేస్తోంది. విభిన్నమైన కథాంశాలతో స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తూ సినిమాలను ప్రేక్షకులకు ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విక్రమ్ కుమార్ కు మంచి అనుభవం ఉంది. కథ రియాల్టీకి దూరం ఉన్నా కూడా ఆయన చూపించిన విధానం అందరికి నచ్చుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని డిసెంబర్‌ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకునేలా చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది దసరా వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.