అక్షర మూవీ రివ్యూ అండ్ రేటింగ్

325
Nandita Swetha Akshara Movie Review and Rating

మూవీ: అక్షర రివ్యూ అండ్ రేటింగ్
రేటింగ్: 2.75/5
నటీనటులు: నందితా శ్వేత, సంజయ్ స్వరూప్, శకలక శంకర్, సత్య, మధునందన్, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, శ్రీతేజ్, శత్రు తదితరులు
కథ, దర్శకత్వం: బీ చిన్నికృష్ణ
నిర్మాత: అల్లూరి సురేశ్ వర్మ
మ్యూజిక్: సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి: నగేష్ బానెల్
ఎడిటింగ్: జీ సత్య
బ్యానర్: సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్

సినీ రూప‌క‌ర్త‌లు ప్ర‌తివారం నాలుగైదు సినిమాల్ని విడుద‌ల చేస్తూ సినీ ప్రియులకి వినోదాల కొర‌త తీరేలా చేస్తున్నారు. ఈ వారం కూడా అర‌డ‌జ‌ను చిత్రాలు విడుదల‌య్యాయి. అందులో ఒక‌టి… ‘అక్ష‌ర‌’. క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్ర‌మిది. ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? నందిత శ్వేత నటన ఏ మేరకు ఆకట్టుకుంది?

అక్షర కథ:
విద్యా విధాన్ కార్పోరేట్ కాలేజీ యాజమాని (సంజయ్ స్వరూప్) సంస్థలో అక్షర లెక్చరర్. అదే కాలేజీలో పనిచేసే శ్రీతేజ్ (శ్రీతేజ్) అనే ఉద్యోగి అక్షర‌ను చూసి ప్రేమలో పడుతాడు. తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించగా శ్రీతేజ్‌ను అక్షర కాల్చి చంపుతుంది. శ్రీతేజ‌తోపాటు, ఏసీపీని కూడా తానే హ‌త్య చేశానంటూ అక్ష‌ర పోలీసుల‌కి లొంగిపోతుంది. మ‌రి ఆ ఇద్ద‌రినీ అక్ష‌ర‌నే హ‌త్య చేసిందా? చేస్తే అందుకు కార‌ణ‌మేమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

నటీనటులు:
అక్ష‌ర‌గా నందిత శ్వేత చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. ద్వితీయార్ధంలో ఆమె పాత్ర ఆక‌ట్టుకుంటుంది. కార్పొరేట్ విద్యాసంస్థ‌ల అధిప‌తి సంజ‌య్‌గా సంజ‌య్ స్వ‌రూప్ కీల‌క పాత్ర‌ని పోషించారు. ఆయ‌న విల‌నిజం సినిమాకి హైలైట్ అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల ప్రాధాన్యత గురించి చెప్పిన విధానం సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. మిగిత నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. కెమెరా, సంగీతం విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ద‌ర్శ‌కుడు చిన్నికృష్ణ ఎంచుకున్న నేప‌థ్యం బాగుంది కానీ, క‌థ‌కుడిగా ఆయ‌న ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. నిర్మాత సురేశ్ వర్మ మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ పాటించారు కానీ.. కథ, కథనాలపై మరింత దృష్టి పెడితే మెరుగైన ఫలితం రాబట్టే చాన్స్ ఉండేది. సామాజిక బాధ్యత అంశంగా వచ్చే సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు అక్షర సినిమా తప్పకుండా నచ్చుతుంది.

విశ్లేషణ:
మార్కులు, ర్యాంకుల అంటూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసే కార్పోరేట్ కాలేజీలపై సంధించిన విమర్శనాస్త్రం అక్షర చిత్రం. బేసిక్ పాయింట్‌ బాగున్నప్పటికీ.. దానిని వెండితెర మీద ఫీల్‌గుడ్ పాయింట్‌గా, వ్యవస్థను ఆలోచింప చేసేలా చేయడంలో తడబాటు కనిపిస్తుంది. నిత్యం ప‌త్రిక‌ల్లోనూ, టీవీ ఛానెళ్లలోనూ చ‌ర్చ‌కొచ్చే అంశాలే ఇందులోని క‌థ‌. అయితే విద్యావ్య‌వ‌స్థ‌లోని మంచి చెడుల కంటే కూడా… ఓ యువ‌తి ప్ర‌తీకార క‌థే హైలైట్ అయ్యింది.

తొలి భాగంలో షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్‌తో నాసిరకమైన కామెడీ నమ్ముకున్న దర్శకుడు రెండో భాగం చివర్లో అసలు కథను చెప్పడంతో అప్పటికే సమయం మించిపోయింది. సినిమాల్లో అక్క‌డ‌క్క‌డా ఒక‌ట్రెండు స‌న్నివేశాలు క‌నిపిస్తుంటాయి త‌ప్ప పూర్తి స్థాయిలో ఇదే అంశంతోనే వ‌చ్చిన సినిమాలు అరుదు. అందరూ సుల‌భంగా క‌నెక్ట్ అయ్యే ఈ అంశాన్ని ఆలోచ‌న, ఆస‌క్తి రేకెత్తించేలా తీయాల్సిన దర్శ‌కుడు ఓ సాధార‌ణ ప్ర‌తీకార క‌థ‌లా మార్చేశాడు.

అక్షర మూవీలో చివరి అర్ధగంట సినిమాకు బలమైన పాయింట్‌గా మారింది. ప్రీ క్లైమాక్స్‌లో హర్షవర్ధన్ ఎపిసోడ్, అక్షర బాల్యంలోని ఎమోషనల్ సంఘటనలు సినిమాను భావోద్వేగంగా మారుస్తాయి. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడంతో సగటు ప్రేక్షకుడు ఆలోచింప చేసేలా మారుతాయి. క‌థ‌నంలో లోపంతో సినిమా ఎక్క‌డా ఆస‌క్తిగా అనిపించదు. ప‌తాక స‌న్నివేశాలు కూడా ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతాయి.

బలాలు:
నందిత శ్వేత న‌ట‌న‌
విరామానికి ముందు మ‌లుపు
ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు:
క‌థ‌నం
ప్ర‌థమార్ధం