Homeరివ్యూస్Narappa Review: ‘నారప్ప’ వెంకటేశ్‌ వన్‌మ్యాన్‌ షో

Narappa Review: ‘నారప్ప’ వెంకటేశ్‌ వన్‌మ్యాన్‌ షో

Venkatesh Narappa Telugu Movie Review Rating
విడుదల తేదీ : జూలై 20,2021
Rating : 3.25/5
నటీనటులు : వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు
దర్శకుడు : శ్రీకాంత్‌ అడ్డాల
నిర్మాతలు : ఎస్. థాను, దగ్గుబాటి సురేష్‌బాబు
సంగీత దర్శకుడు : మణిశర్మ
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ అటు కుటుంబ ప్రేక్షకులకు, ఇటు యువతకు ఎప్పుడూ దగ్గరగా ఉండే అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైన ‘నారప్ప’ ఎలా ఉంది? యువకుడిగా, తండ్రిగా వెంకటేశ్‌ ఏ మేరకు మెప్పించారు? శ్రీకాంత్‌ అడ్డాల టేకింగ్‌ ఎలా ఉంది? ‘అసురన్‌’కు దీటుగా ‘నారప్ప’ ఉన్నాడా? ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :
నారప్ప తన భార్య సుందరమ్మ తో కలిసి తనకున్న మూడెకరాల పొలం చేసుకుంటూ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో హాయిగా జీవితం సాగిస్తుంటాడు. అతడికి మునికన్నా(కార్తీక్‌ రత్నం), సిన్నబ్బ(రాఖీ), బుజ్జమ్మ(చిత్ర) ముగ్గురు పిల్లలు. ఆ ఊరి పెద్ద పండు స్వామి(నరేన్‌).. తన తమ్ముడి దొరస్వామి(దీపక్‌ శెట్టి) కోసం ఊళ్లో పేదల భూములన్నీ తీసేసుకుంటాడు. కానీ, నారప్ప తన మూడెకరాల భూమిని మాత్రం ఇవ్వడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా ఊరి పెద్ద మనషి పై చేయి చేసుకుంటాడు మునికన్నా. ఆ పగతో ఆ పెద్ద మనిషి తన మనుషులతో మునికన్నాని దారుణంగా చంపిస్తాడు. దాంతో నారప్ప చిన్న కొడుకు సినప్ప ఆ పెద్దమనిషిని నరికేస్తాడు. తర్వాత వారి నుండి నారప్ప తన చిన్న కొడుకుని, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు ? అప్పుడు నారప్ప ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:
డబ్బు ఉన్న వాడికీ లేనివాడికి, బలవంతుడికీ బలహీనుడికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఎన్నో కథలు వెండితెరను అలరించాయి. బలహీనుడు తిరగబడితే ఎంతటి బలవంతుడైనా మట్టి కరవాల్సిందే. ‘భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు’ అంటూ చదువు ఆవశ్యకతను వివరిస్తూ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తమిళంలో వచ్చిన ‘అసురన్‌’ ఎంతగానో అలరించింది. అదే కథను వెంకటేశ్‌ కీలక పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల ‘నారప్ప’గా తీయడంలో విజయం సాధించారు.

Venkatesh Narappa Movie Review Rating

నారప్పగా వెంకటేష్ అద్భుతంగా నటించారు. మెయిన్ గా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ లో అలాగే కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాల్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. మెయిన్ గా కొడుకు చనిపోయిన తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ లో, అలాగే ఇంటర్వెల్ లో చేత కాని తండ్రి కాస్త, నారప్పగా మారి చిన్న కొడుకుని కాపాడే సీక్వెన్స్ లో, మరియు క్లైమాక్స్ లో వెంకటేష్ నారప్ప పాత్రలో జీవించారు.

- Advertisement -

ద్వితీయార్ధంలో నారప్ప గతం చెప్పడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకున్నాడు దర్శకుడు. మాతృక ‘అసురన్‌’ను యథావిధిగా ఫాలో అయ్యాడు. నారప్ప యువకుడిగా ఉన్నప్పుడు వచ్చే సన్నివేశాలు, నేపథ్యం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అవన్నీ పెద్దగా ఆకట్టుకోవు. అయితే, ఫ్లాష్‌ బ్యాక్‌, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు మాత్రం అలరిస్తాయి. ఇప్పటికే ‘అసురన్‌’ చూసిన వారికి ‘నారప్ప’లో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించవు. దీంతో కథంతా ముందే తెలిసిపోవడం ఈ సినిమాకు కాస్త మైనస్‌.

Narappa OTT Review Rating

ప్రియమణి, కార్తీక్‌రత్నం, రాజీవ్‌ కనకాల, రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా కార్తీక్‌రత్నం కనిపించేది కొద్దిసేపే అయినా, కథను మలుపు తిప్పే పాత్ర. సాంకేతికంగా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలు ఓకే. కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. అయితే, యాక్షన్‌ సన్నివేశాలను ఎలివేట్‌ చేయడంలో మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లింది.

‘నారప్ప’ సినిమా పై మీ అభిప్రాయం ఏమిటి..?

[totalpoll id=”72942″]

 

సాంకేతిక విభాగానికి వస్తే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ బాగుంది. వెంకటేష్ నారప్ప పాత్రను ఎలివేట్ చేసిన విధానం, అలాగే వెంకీ నుండి రాబట్టుకున్న పెర్ఫార్మెన్స్ విషయంలో శ్రీకాంత్ మంచి పనితనం కనబర్చాడు. ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. థియేటర్‌ను దృష్టిలో పెట్టుకుని నిడివి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది.

ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చక్కగా చూపించారు. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. కొన్ని చోట్ల కథాగమనం నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఓవరాల్‌గా సినిమా ఓకే. ముఖ్యంగా వెంకటేష్ నటన, ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమా స్థాయిని పెంచాయి.

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY

Venkatesh Narappa Telugu Movie Review Rating.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చక్కగా చూపించారు. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. కొన్ని చోట్ల కథాగమనం నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఓవరాల్‌గా సినిమా ఓకే. ముఖ్యంగా వెంకటేష్ నటన, ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమా స్థాయిని పెంచాయి.Narappa Review: ‘నారప్ప’ వెంకటేశ్‌ వన్‌మ్యాన్‌ షో