ఓటీటీ రివ్యూ : ‘మిస్ ఇండియా’

Keerthy Suresh Miss India Telugu Movie OTT Review Rating

చిత్రం : ‘మిస్ ఇండియా’
రేటింగ్: 2/5
నటీనటులు: కీర్తి సురేష్-నవీన్ చంద్ర-జగపతిబాబు-నదియా-నరేష్-రాజేంద్ర ప్రసాద్-కమల్ కామరాజు-సుమంత్ శైలేంద్ర-పూజిత పొన్నాడ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్
నిర్మాత: మహేష్ కోనేరు
రచన: నరేంద్రనాథ్-తరుణ్ కుమార్
దర్శకత్వం: నరేంద్రనాథ్

మహానటి, పెంగ్విన్ సినిమాల తర్వాత నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘మిస్ ఇండియా’. ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు.. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా అయినా కీర్తి స్థాయికి తగ్గట్లు ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

మానస సంయుక్త (కీర్తి సురేష్) విశాఖపట్నంలోని లంబసింగి ప్రాంతానికి చెందిన మధ్య తరగతి అమ్మాయి. తాను పెద్దయ్యాక ఎంబీఏ చదివి బిజినెస్ చేయాలని చిన్నతనంలోనే ఒక లక్ష్యం పెట్టుకుంటుంది. ఆమె తాతయ్య (రాజేంద్ర ప్రసాద్) తనకు ప్రోత్సాహంగా నిలుస్తాడు. ఈ క్రమంలో కొన్ని కారణాల వల్ల ఆమె ఫ్యామిలీ అమెరికా వెళ్తారు. అయితే సంయుక్త కలలు చాలా ఉన్నతంగా ఉంటాయి. వాటిని నెరవేర్చుకునేందుకు అమెరికాలో ఆమె మిస్ ఇండియా అనే చాయ్ బిజినెస్ ను స్టార్ట్ చేస్తోంది. కానీ, అక్కడ కాఫీ బిజినెస్ పెట్టి బిజినెస్ ను రూల్ చేస్తోన్న కైలాష్ (జగపతిబాబు) లాంటి ప్రత్యర్థులను తట్టుకుని ఆమె ఎలా నిలబడింది ? చివరకు నిలబడి విజేతగా ఎలా నిలిచింది ? మొత్తంగా ఒక మద్య తరగతి అమ్మాయి ఛాలెంజిగ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

- Advertisement -

కీర్తి సురేష్ మరోసారి తన నటనతో షో టాపర్ అనిపించుకుంది చెప్పాలి. తన పెర్ఫార్మన్స్ తో ప్రతి సీన్ లోనూ ఆకట్టుకుంటోంది. నటిగా సినిమా సినిమాకి తనను తానూ ఎక్స్‌ప్లోర్‌ చేసుకుంటూ ముందుకుపోతోంది. పైగా ‘మిస్‌ ఇండియా’లో తన పాత్ర కోసం కీర్తి సురేష్ స్లిమ్‌ అయింది. ఈ సినిమాలో కీర్తికి తల్లిగా నదియా, తండ్రిగా సీనియర్ నరేష్, అన్నగా కమల్ కామరాజు నటించారు.

వ్యాపారం చేయాలన్న తన ఆలోచనను ఇంట్లో వాళ్లు అర్థం చేసుకోలేదని బయటికి వచ్చేశాక ఆమెకు అప్పుడు కూడా టీనే గుర్తుకొస్తుంది. పెద్ద రేంజిలో టీ వ్యాపారం చేసెయ్యాలని ఫిక్సయిపోతుంది. అందుకోసం ఒక పెద్ద కాఫీ బ్రాండును నడిపించే మల్టీ మిలియనీర్ ను కలుస్తుంది. అతను కాదంటే సవాలు చేస్తుంది. సొంతంగా టీ బిజినెస్ పెట్టేస్తుంది. అన్నిటినీ ఎదిరించి ఒక అమ్మాయి వ్యాపారంలోకి అడుగుపెట్టి సక్సెస్ కావడం లాంటి కొన్ని సీన్స్ బాగున్నాయి. ఛాయ్ బిజినెస్‌ను ప్రారంభించిన కీర్తి.. ప్రత్యర్థిగా స్టైలిష్ బిజినెస్‌మెన్‌ జగపతిబాబును ఎలా ఓడించింది అనేది బాగానే ఉంది.

సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి రొటీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. ఎక్కడా మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. అనవసరపు లవ్ ట్రాక్ ని పెట్టడం ఫస్ట్ హాఫ్ కి పెద్ద మైనస్. దర్శకుడు నరేంద్రనాధ్ కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరీ బోర్ గా అనిపిస్తాయి.

సినిమాటోగ్రఫీ అందించిన సుజీత్ వాసుదేవ్ విజువల్స్ ఈ సినిమాకి మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి. ప్రతి షాట్ సూపర్బ్ అనిపిస్తుంది. అలాగే ఆ విజువల్స్ కి మరింత ప్రాణం పోసింది మాత్రం థమన్ మ్యూజిక్ అని చెప్పే తీరాలి. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. ఇక సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి. నిజానికి సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, తను అనుకున్న ల్యాగ్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. దాంతో సీన్స్ బోర్ గా సాగాయి. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి.

తీర్పు :

మహానటి ఇమేజ్ తో కీర్తి సురేష్ స్టార్ట్ చేసిన ఈ మిస్ ఇండియా సినిమా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం చాలా పెద్ద మిస్ ఫైర్ అయ్యింది. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం కొన్ని ఎలిమెంట్స్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ తో మరియు కీలక సన్నివేశాలతో ఆకట్టుకున్నా.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు బోర్ గా సాగే కథనం, అలాగే మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం,కథలోని పాత్రలు పెద్దగా కనెక్ట్ కాకపోవడం, కొన్ని పాత్రలు జస్ట్ లెంగ్త్ కోసం వచ్చి వెళ్లిపోవడం లాంటి విషయాలు ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తాయి. ఆ కారణంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించరు.

Related Articles

Telugu Articles

Movie Articles