ninnu thalachi Telugu Movie Review
ninnu thalachi Telugu Movie Review

విడుదల తేదీ : సెప్టెంబరు 27, 2019
రేటింగ్ : 1.75/5
నటీనటులు : వంశీ ఏకసిరి, స్టెఫీ పటేల్
దర్శకత్వం : అనిల్ తోటా
నిర్మాత‌లు : నేదురుమల్లి అజిత్ కుమార్ , మోదిగిరి ఓబులేష్
సంగీతం : మహావీర
సినిమాటోగ్రఫర్ : సత్య
ఎడిట‌ర్‌ : సాయి, అనిల్ తోట

అనిల్ తోట దర్శకత్వంలో వంశీ యాకసిరి, స్టెపీ పటేల్ హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం “నిన్ను తలచి”. ఎస్.ఎల్.ఎం ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ :

ఈ సినిమాకి ఇది కథ అని చెప్పుకోవడానికి పెద్దగా కథ ఏమి లేదు. కానీ కథ గురించి కనీస స్థాయిలోనైనా ముచ్చటించుకోవాలి గనుక.. రొటీన్ సినిమాల్లోలాగే ఈ సినిమాలో కూడా బేవర్స్ గా తిరిగే అభిరామ్ (వంశీ) అనే కుర్రాడు.. అంకిత (స్టెపీ పటేల్) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. అలాగే ఆమె కూడా తనను చూసి మనసు పారేసుకునేలా చేయడానికి తన వంతు ప్రయత్నాలు తానూ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు అభి రామ్. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అంకిత వేరే అతన్నీ ప్రేమిస్తోందని అభికి తెలుస్తోంది ? దాంతో అభి ఆమెను ప్రేమలో పడేయడానికి ఏమి చేశాడు ?మరి అంకిత అభితో ప్రేమలో పండిందా ? చివరికి అంకిత – అభి ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటులు :

సినిమాలో వైజాగ్ ప్రాంతానికి చెందిన ఓ ఎబౌవ్ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో నటించిన వంశీ ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం.. అలాగే కొన్ని కీలకమైన సన్నివేశాల్లో మరియు క్లైమాక్స్ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలెట్ గా నిలచారు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో అలాగే డాన్స్ తో ఆకట్టుకున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన స్టెపీ పటేల్ అచ్చం ఓ సగటు తెలుగు అమ్మాయిగా చాలా బాగా నటించింది. లవ్ సీన్స్ తో పాటు సాంగ్స్ లో కూడా అనఘ నటన, ఆమె పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు తన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్:

టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను కనీస స్థాయిలో కూడా ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో చాల సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. పైగా కథకు అవసరానికి మించి కామెడీ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే అసలు సరైన ప్లో కూడా ఉండదు. పైగా సెకండాఫ్ బాగా ల్యాగ్ అయింది. ఇక కథకు సంబంధించిన సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ సాగుతున్న ఓవరాల్ గా కథనం మాత్రం ముందుకు నడిపించవు. పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో పెద్ద మైనస్ పాయింట్.

ఇక సత్య సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను ఆయన చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు మహావీర అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. సాయి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్లే సాగుతుంది. నిర్మాతలు నేదురుమల్లి అజిత్ కుమార్ , మోదిగిరి ఓబులేష్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకోవు.

మొత్తానికి దర్శకుడు అనిల్ తోట తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద కరెక్ట్ ఎలివేట్ చేయలేకపోయారు. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం కథకు అవసరం లేని కామెడీ సీక్వెన్స్ తో.. అసందర్భంగా వచ్చే రొమాంటిక్ సాంగ్స్ తో సినిమాని నడిపించడంతో ట్రీట్మెంట్ బాగా బోర్ గా సాగుతుంది.

తీర్పు :

వంశీ యాకసిరి, స్టెపీ పటేల్ హీరోహీరోయిన్లుగా ‘నిన్ను తలచి’ అంటూ వచ్చిన ఈ చిత్రం కనీస స్థాయిలో కూడా ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడు అనిల్ రాసుకున్న కథా కథనాల్లో ప్లో లేకపోవడం, సినిమాలో కథకు అనవసరమైన పండని కామెడీ సీన్స్ ఎక్కువుగా ఉండటం.. అన్నిటికి మించి సినిమా స్టోరీ పాయింట్ కి తగ్గట్లు ఆసక్తికరంగా సాగకపోగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడంతో సినిమా బాగా విసిగిస్తోంది. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసస్థాయిలో కూడా నెట్టుకురాలేదు.