నితిన్ చెక్ రివ్యూ: థ్రిల్, మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయాలని ఎదురుచూసినోళ్లకు చెక్ మేట్..!

347
Nithin Check Review Rating in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 26, 2021
రేటింగ్ : 2.75/5
నటీనటులు : నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్
దర్శకత్వం : చంద్ర శేఖర్ యేలేటి
నిర్మాత‌లు : వి. ఆనంద్ ప్రసాద్
సంగీతం : కల్యాణి మాలిక్
సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటింగ్ : సనల్ అనిరుధన్

చంద్రశేఖర్ ఏలేటి సినిమాలంటే చాలు.. ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఎందుకంటే గతంలో ఆయన తీసిన సినిమాలు అలాంటివి..! హాలీవుడ్ తరహాలో ఆయన సినిమాలు ఉంటాయి. కమర్షియల్ సక్సెస్ లు చాలా తక్కువ. ఈసారి మాత్రం కమర్షియల్ హీరో నితిన్ ను హీరోగా పెట్టి ‘చెక్’ సినిమా ప్లాన్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ దగ్గర నుండి ట్రైలర్ వరకూ ఈ సినిమా చెస్ బ్యాక్డ్రాప్.. జైలులో ఉన్న ఖైదీ నిర్దోషిగా బయటపడతాడా అనే విషయాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. కాబట్టి కొత్త తరహా స్టోరీగా తెలుగు ప్రేక్షకులకు అనిపిస్తుంది. అదే ఉద్దేశ్యంతో సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు చంద్రశేఖర్ ఏలేటి-నితిన్ కాంబో అలరించిందా లేదా అన్నది తెలుసుకుందాం..!

క‌థ : ఆదిత్య(నితిన్‌).. స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటాడు. అందుకే చోర కళలో నిష్ణాతుడు అవుతూ ఉంటాడు‌. మోసాలు చేస్తూ.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ సమయంలో యాత్ర అనే అమ్మాయి అతడి జీవితంలోకి వస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకునే సమయానికి.. స‌డెన్‌గా దేశంలో ఉగ్ర‌దాడి జ‌రుగుతోంది. ఈ దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ ఉగ్రదాడికి సాయపడిన వారిలో ఆదిత్య కూడా ఒక్కడని అనుమానించి ఉరిశిక్ష విధిస్తారు.

ఆ స‌మ‌యంలో అత‌డినికి శ్రీమ‌న్నారాయ‌ణ‌‌(సాయి చంద్‌) అనే తోటి ఖైదీ ప‌రిచ‌యం అవుతాడు. ఆదిత్య‌కి చెస్ నేర్పిస్తాడు. ఆదిత్య గొప్ప చెస్ ఆట‌గాడు అవుతాడ‌ని న‌మ్మిన శ్రీమ‌న్నారాయ‌ణ తనకు ఉన్న పలుకుడిబడితో ఆదిత్యను చెస్‌ గేమ్‌ ఆడేలా ఒప్పిస్తాడు. ఇదే స‌మ‌యంలో ఆదిత్య తాను ఉగ్ర‌వాదిని కాద‌ని, తానెలాంటి నేరం చేయ‌లేద‌ని కోర్టులో పిటిష‌న్ వేస్తాడు. కోర్టులో దారుల‌న్నీ మూసుకుపోవ‌డంతో రాష్ట్ర‌ప‌తి క్ష‌మాభిక్ష కోసం ఎదురుచూస్తుంటాడు. అయితే ఆదిత్య కోసం లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్) కేసు వాదిస్తూ ఉంటుంది. అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో క్షమాభిక్షకి కూడా నోచుకోడు. మ‌రికొన్ని గంట‌ల్లో ఉరి కంబం ఎక్కాల్సిన ఆదిత్య జైలు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అందుకు తాను నేర్చుకున్న చెస్ ఎలా సాయ‌ప‌డింది? చెస్ లో ఏ స్థాయి ఆటగాడిలా ఆదిత్య మిగిలిపోయాడు? అనేది సినిమా చూస్తే తెలిసిపోతుంది.

విశ్లేష‌ణ : కోర్టు సీన్‌తో సినిమా మొదలవుతుంది. స్వేచ్ఛగా బ్రతకాలి అని అనుకునే ఆదిత్యకు జైలులో ఉండడం అసలు నచ్చదు. కానీ ఓ వైపు లాయర్ సహాయంతో న్యాయంగా గెలవాలని అనుకుంటూ ఉంటాడు. మరో వైపు చెస్ లో కూడా మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. ఇక జైలు నుండి తప్పించుకోవాలి అని అనుకోవాలని అతడు ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించకపోయినా.. క్లైమాక్స్ సన్నివేశాలు చూశాక హాలీవుడ్ లో వచ్చిన ‘జైలు నుండి తప్పించుకుపోయే’ సినిమాల ప్రభావం తప్పకుండా కనిపిస్తూ ఉంది.

చెస్ అన్నది ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుందా అనే కోణంలో కూడా ఆలోచించి ఉంటే ఇంకా బాగున్ను. కొన్ని కొన్ని సార్లు కథ అటు తిరిగి.. ఇటు తిరిగి ఒకే చోటకు వస్తూ ఉంటుంది. అదే ప్రేక్షకులను పెద్దగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జైల్లో గొడవలు.. టార్చర్ పెట్టే పోలీసులు వంటివి ఎక్కడో చూసినట్లు తప్పకుండా అనిపిస్తుంది. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం సాగ‌దీత‌గా అనిపిస్తాయి. ట్విస్ట్‌లన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. ఎక్కువ సన్నివేశాలు జైలులోనే క‌నిపిస్తాయి. ఆట నేప‌థ్యంలో డ్రామా ఇంకాస్త బ‌లంగా ఉంటే బాగుండేది. క్లైమాక్స్ మాత్రం కొత్త అనుభూతిని పంచుతుంది. అక్క‌డ్క‌డా ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. కానీ హాలీవుడ్ సినిమాలు, కాస్త ముందుగానే ఊహించే అలవాటు ఉన్న వాళ్లకు క్లైమాక్స్ కూడా పెద్దగా ఎక్కకపోవచ్చు.

నటీనటులు: నితిన్ చుట్టూ కథ తిరుగుతుంది. పర్వాలేదనిపించే నటన.. ఇక లాయ‌ర్ పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ .. ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ పర్వాలేదు.శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్‌ ఒదిగిపోయాడు. పోసాని, హ‌ర్షవర్థన్‌, ముర‌ళీశ‌ర్మ, సంపత్‌రాజ్‌ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మిగిలిన పాత్రలు మరీ ఎక్కువ స్కోప్ లేదు.

సాంకేతిక విభాగం: క‌ల్యాణిమాలిక్ నేప‌థ్య సంగీతం బాగుంది. నరేశ్‌ అందించిన మాట‌లు క‌థ‌కి బ‌లాన్నిచ్చాయి. ద‌ర్శకుడు చంద్రశేఖ‌ర్ యేలేటి మ‌రోసారి ఓ కొత్త ర‌క‌మైన క‌థ‌ని తెలుగు ప్రేక్షకుల‌కు ప‌రిచ‌యం చేశారు. కానీ గత సినిమాల మ్యాజిక్ మిస్ అయ్యింది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. జైలు సెట్ బాగుంది. రాహుల్ శ్రీవాత్సవ్‌ కెమెరా, వివేక్ క‌ళా ప్రతిభ తెర‌పై స్పష్టంగా క‌నిపిస్తుంది.

ఫైనల్ గా: థ్రిల్, మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయాలని ఎదురుచూసినోళ్లకు చెక్ మేట్..!