తెలుగు వెబ్‌ సిరీస్‌లో మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్!

0
160
Nithya Menen Telugu Web Series Under Vyjayanthi banner

Nithya Menen Telugu web series: ఇటీవల చాలామంది సినీతారలు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఒరవడిని అందిపుచ్చుకుంటోంది మలయాళ బ్యూటీ నిత్యా మీనన్. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఆమె కొత్త అవతారమెత్తింది. బ్రీత్‌: ఇన్‌టు ద షాడోస్‌’ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. అది తెలుగులో డబ్ కావడంతో ఇక్కడి ప్రేక్షకులను అలరించింది. అయితే అదే రూట్‌లో నిత్యా ఇప్పుడు తెలుగు వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్నీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మహానటి లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించారు అగ్రనిర్మాత అశ్వనిదత్. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. నిజానికి కీర్తి సురేష్ పాత్రలో నటించాల్సిందిగా మలయాళ బ్యూటీ నిత్యామీనన్ కి నాగ్ అశ్విన్ ఆఫర్ చేశారని అప్పట్లో కథనాలొచ్చాయి. కానీ అది వీలు పడకపోవడంతో కీర్తి సురేష్ ని ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారని గుసగుసలు వినిపించాయి.అయితే నిత్యా మీనన్ మహానటి నిర్మాతలతో కలిసి పనిచేయనున్నారన్నది తాజా అప్ డేట్. నిత్యా ప్రధాన పాత్రలో తెలుగు వెబ్-సిరీస్ ని ప్లాన్ చేస్తున్నారని. దీనిని సీనియర్ నిర్మాత అశ్విని దత్ పెద్ద కుమార్తె స్వాప్నా దత్ నిర్మిస్తారని ఇటీవల కథనాలొచ్చాయి.

బలభద్రపాత్రుని రమణి అందించిన కథతో గోమ్‌టేశ్‌ ఉపాధ్యే దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్‌లో నిత్యా మీనన్ నటించనున్నట్లు తెలుస్తోంది. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ షో రన్నర్‌గా వ్యవహరిస్తారని సమాచారం. డిసెంబర్‌ లేదా జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయని సమాచారం. ఇన్నాళ్లూ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన నిత్యా మీనన్ వెబ్ సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం మంచి పరిణామమే.