దర్శకుడు శంకర్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్!

0
434
Non Bailable Warrant Issued Against Director S

భారీ సినిమాలు రూపొందిస్తూ తనదంటూ ప్రత్యేక శైలి అని నిరూపించుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. అది కూడా ఆయన రూపొందించిన రోబో సినిమా కారణంగా. నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావడం కలకలం రేపుతోంది. 2010 శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ `రోబో`. తమిళంలో ఈ చిత్రాన్ని `ఎందిరన్‌` పేరుతో రూపొందించారు. సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.

2010 సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా రోబో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు శంకర్. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా కథపై గత కొంత కాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. పలు మార్లు శంకర్‌ని కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించినా శంకర్ పెద్దగా స్పందించలేదు. దీంతో తాజాగా శంకర్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేస్తూ కేసును ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది చెన్నై ఎగ్మోర్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు.

రచయిత అరుర్ తన ఫిర్యాదులో శంకర్ కాపీరైట్ చట్టం, 1957 ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ చిత్రం విజయం నుండి శంకర్ మరియు అతని బృందం కూడా భారీగా డబ్బు సంపాదించారని ఆయన ఫిర్యాదు చేశారు. 1996లో అరుర్‌ తమిళ్‌ నందన్‌ రాసిన ‘జిగుబా’ కథ ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురితమవడమే కాకుండా ఆ తర్వాత 2007లో ఈ కథను ఓ నవలగా ముద్రించారు. సో.. చూడాలి మరి ‘రోబో’తో వచ్చిన చిక్కుల్లోంచి శంకర్ ఎలా బయటపడతారనేది!.