paruchuri gopala krishna talks about balakrishna, boyapati srinus simha movie

Balakrishna Simha Movie: మాస్ సినిమాలకు.. యాక్షన్ ఫ్యాక్షన్ సినిమాలకు కథలు మాటలు అందించడంలో పరుచూరి బ్రదర్స్ ది అందెవేసిన చేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలకృష్ణ సినిమా అనగానే మనకు ముందుగా ఆయన చెప్పిన డైలాగులు గుర్తుకు వస్తాయి. ఆ పవర్‌ఫుల్ డైలాగుల వెనుక ఉన్నది పరుచూరి బ్రదర్స్. వారు అద్బుతమైన కథలు మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ ను స్టార్ హీరోలకు అందించారు. సుదీర్ఘ కాలంగా రచయితగా కొనసాగుతున్న పరుచూరి గోపాలకృష్ణ తన అనుభవాలను యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకుంటూ వస్తున్నారు.

అయితే, బాలయ్య కెరీర్‌ను మరో మలుపు తిప్పిన ‘సింహా’ సినిమా గురించి మాట్లాడుతూ ఈలా అన్నారు. సింహా సినిమా కోసం 15 రోజులు బోయపాటితో ట్రావెల్ చేశాం. కాని ఆ సినిమాకు మాటలు అందించలేక పోయాం అంటూ గోపాల కృష్ణ అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. నిజానికి బాలకృష్ణ డేట్లు ఇచ్చిన తరవాత బి.గోపాల్ దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించారట నిర్మాత పరుచూరి ప్రసాద్. కథ కోసం గోపాలకృష్ణ వద్దకు వెళ్లారు. అయితే, ఆ సమయంలో బి.గోపాల్ అందుబాటులో లేకపోవడంతో కొత్త దర్శకుడి కోసం వేట మొదలెట్టారట. ఈ క్రమంలో ‘భద్ర’, ‘తులసి’ వంటి మాస్ సినిమాలతో ఫామ్‌లో ఉన్న బోయపాటి శ్రీను అయితే న్యాయం చేస్తారని గోపాలకృష్ణ సూచించారట. బోయపాటినే ఫైనల్ చేసి కథా చర్చల్లో కూర్చున్నారట.

15 రోజుల పాటు మా ఆఫీస్ లో బోయపాటితో కథ చర్చలు జరిగాయి. బోయపాటి చాలా కథలు చెప్పారు. మేము రాజశేఖర్ హీరోగా అనుకున్న కామ్రేడ్ కథను చెప్పాను. ఆ కథ వంటిదే తన వద్ద ఉందని బోయపాటి అన్నాడు. ఆ కథను బోయపాటి పూర్తి చేస్తే మాటలు మేము రాస్తామని అన్నాం. బోయపాటి సింహా కథతో కొన్ని రోజులు కొరటాల శివతో మరికొన్ని రోజులు రత్నంతో కలిసి కూర్చుని చర్చలు జరిపినట్లుగా తెలిసింది. కథ కోసం వారు చర్చలు జరుపుతున్నారని మాటలు రాసేది మేమే అనుకున్నాం. అనుకోకుండా నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అక్కడకు వెళ్లిన తర్వాత ఒక వెబ్ సైట్ లో సింహా మూవీ కథ.. మాటలు.. స్ర్కీన్ ప్లే.. దర్శకత్వం బోయపాటి అని చూశాను. నేను అమెరికా వెళ్లడం వల్ల ఆ ప్రాజెక్ట్ చేయి జారి పోయింది.

మొత్తం మీద ‘సింహా’ సినిమాను బోయపాటి చాలా అద్భుతంగా తీశారని గోపాలకృష్ణ కొనియాడారు. ప్రతి అంశాన్ని చాలా చక్కగా తెరకెక్కించి అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీశారని ప్రశంసించారు. ‘సింహా’ సినిమాలో తప్పులేమీ వెతకలేం అని అన్నారు. అయితే, 15 రోజులు ట్రావెల్ చేసిన ఒక మంచి సినిమాలో తాను భాగం కాలేకపోయాననే బాధ తనకు జీవితాంతం ఉండిపోతుందని గోపాలకృష్ణ తన మనసులో మాటను వెల్లడించారు.